విశాఖలో కలకలం... కారు బ్యానెట్లో దూరిన పాము! ఏపీలో సిటీ కల్చర్‌కు కేరాఫ్ అయిన విశాఖ నగరంలో.. 24 గంటలూ జనం రోడ్లపై తిరుగుతూనే ఉంటారు. నగరం నలువైపులా ప్రజల కదలికలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అలాంటి ప్రాంతంలో.. రాత్రి వేళ.. ఓ పాము అందరినీ కంగారు పెట్టించింది. భయంతో జనాన్ని పరుగులు తీసేలా చేసింది. వాహనంలో దూరి బయటకు రాకుండా ముచ్చెమటలు పట్టించింది. అంతా ఆందోళన చెందుతున్న వేళ.. పాములు పట్టే వ్యక్తి అక్కడికి చేరుకున్నాడు. చాకచక్యంగా.. ఆ పామును ఒడిసిపట్టాడు. అందరిలో భయాన్ని పోగొట్టి.. ఉపశమనం కలిగించాడు. ఈ ఘటన.. నగరంలోని న్యూ రైల్వే కాలనీలో జరిగింది.
అసలు ఏం జరిగింది?
కాలనీలో రోడ్డు పక్కనే నిలిచి ఉన్న ఓ కారుపై.. ఉన్న ఫలంగా ఓ పాము దర్శనమిచ్చింది. అది.. కారు ఫ్రంట్ మిర్రర్‌పై పాకుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సర్పాన్ని చూడగానే.. పరిసర ప్రాంతాల్లోని జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం చేయాలో అర్థం కాక కొందరు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. అంతలోనే.. ఆ పాము కారు బ్యానెట్లోకి దూరిపోయింది. ఎంత సేపైనా బయటికి రాలేదు. ఇది.. అక్కడి జనాల్లో మరింత భయాన్ని, ఆందోళనను పెంచింది.
చాకచక్యంగా.. అత్యంత జాగ్రత్తగా...
ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో.. అక్కడి ప్రజలు పాములు పట్టే వ్యక్తి కిరణ్‌కు సమాచారం ఇచ్చారు. పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకున్నారు. పామును చూడాలన్న ఆరాటంతో.. అక్కడికి వచ్చిన జనాన్ని అదుపు చేశారు. ఎవరూ ఆ పరిసరాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు... విషయం తెలిసిన వెంటనే.. కిరణ్ న్యూ రైల్వే కాలనీకి చేరుకున్నాడు. పాము కదలికలు గుర్తించాడు. ఎవరికీ ఏ ప్రమాదం కలగకుండా.. అత్యంత చాకచక్యంగా.. ఆ పామును కిరణ్ పట్టుకున్నాడు.
పామును చూసి కేరింతలు
కిరణ్.. పామును పట్టుకోగానే.. స్థానికుల్లో ఉన్న భయం మాయమైంది. అంతా కలిసి.. కేరింతలు కొడుతూ ఆ సందర్భాన్ని ఆస్వాదించారు. కిరణ్ సైతం.. బుసలు కొడుతున్న సర్పాన్ని ఒడుపుగా పట్టుకుని అందరిలో ఉత్సాహం నింపారు. చిన్నా పెద్దా తేడా లేకుండా.. అక్కడ ఉన్న వాళ్లంతా కేరింతలు కొట్టారు. ఈ సందర్భాన్ని తమ చరవాణుల్లో చిత్రీకరించేందుకు ఉత్సాహం చూపారు. పాముతో ప్రజలెవరికీ ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడిన కిరణ్.. ఆ సర్పానికి సైతం అపాయం కలగకుండా జాగ్రత్తపడ్డాడు. అక్కడి నుంచి జాగ్రత్తగా మరో ప్రాంతానికి తరలించారు. స్థానిక పోలీసు సిబ్బంది సైతం.. కిరణ్ కు సహకరించి.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తపడ్డారు.
ఇదీ చదవండి:Murder: విద్యార్థినిని గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది