Smita Sabharwal Tweet on Central Deputation Rumours : సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితాసభర్వాల్ (Smita Sabharwal) కేంద్ర ప్రభుత్వానికి డిప్యూటేషన్‌పై వెళ్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై తాజాగా ఆమె ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించారు. ఆ వార్తలన్నీ అవాస్తవమని తెలిపారు. తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌గానే విధులను నిర్వహిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర సర్కార్ ఏ బాధ్యత ఇచ్చిన చేస్తానని వివరించారు. తెలంగాణ ప్రయాణంలో భాగమైనందుకు గర్విస్తున్నాని స్మితా సభర్వాల్ వెల్లడించారు.
Smita Sabharwal Tweet Today : మరోవైపు బుధవారం స్మితా సభర్వాల్, ఎక్స్‌లో (ట్విటర్) చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. సివిల్ సర్వీసెస్‌కు ఎంపికై 23 సంవత్సరాలు అయిందని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కొత్త సవాళ్లకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని, ఎంత ముందుకు వెళ్లామో కొన్ని చిత్రాలు గుర్తు చేస్తాయంటూ ఓ పోస్టు పెట్టారు. ఓ యువతి తన అభిమతానికి అనుగుణంగా, ఎన్నో ఎత్తుపల్లాలను అధిగమిస్తూ 23 ఏళ్లుగా ప్రయాణం సాగిస్తోందని, ఇన్నాళ్లుగా తనపై చూపిన అభిమానానికి ధన్యవాదాలు అంటూ ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
Officers Transfers in Telangana 2023 : త్వరలోనే ఆ 100 మంది అధికారుల బదిలీ..!
తాజా పరిణామాల నేపథ్యంలో ఈ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. మొన్నటి వరకు సీఎం కార్యాలయంలో కార్యదర్శిగా ఉన్న స్మితా సభర్వాల్, రజత్ కుమార్ పదవీ విరమణ అనంతరం నీటిపారుదల శాఖ కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతల్లో ఉన్నారు. అయితే కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె ఇప్పటి వరకూ కలవలేదు. ఇటీవల నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) సమీక్షకు కూడా హాజరు కాలేదు. ఈ క్రమంలో ఆమె చేసిన ట్వీట్‌పై కొన్ని మీడియా సంస్థలు ఆమె డిప్యూటేషన్‌పై కేంద్రంలో విధులు నిర్వహించేందుకు వెళ్తున్నారంటూ వార్తలు ప్రసారం చేశాయి. ఈ విషయంపైనే తాజాగా స్మితా సభర్వాల్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.