SME IPO Conference Under FTCCI in Hyderabad : హైదరాబాద్ గచ్చిబౌలిలోని హయాత్ హోటల్లో ఎఫ్‌టీసీసీఐ ఆధ్వర్యంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఐపీఓ సదస్సును ఏర్పాటు చేశారు. షేర్ మార్కెట్‌లో ఐపీఓకు వెళ్లడానికి చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సరైన ప్రోత్సాహం లేదని, తెలంగాణ వాణిజ్య పారిశ్రామిక మండలుల సమాఖ్య(FTCCI )అధ్యక్షుడు మీలా జయదేవ్ అన్నారు. తద్వారా కేవలం కుటుంబ సభ్యులు, పెట్టుబడిదారుల మీదనే ఆధారపడిల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే చిన్న, మధ్య తరహా పరిశ్రమలు క్రమంగా అభివృద్ధి చెంది, బహుళ జాతి పరిశ్రమలుగా మారతాయని మీలా జయదేవ్ వివరించారు. 2012 సంవత్సరం నుంచి ఈ తరహా పరిశ్రమలు షేర్ మార్కెట్లో లిస్ట్ అవుతున్నాయనీ చెప్పారు. ఎన్ఎస్‌ఈ, బీఎస్ఈలో 850 పైగా కంపెనీలు లిస్ట్ అయితే, ఈ ఏడాదిలో 139 పైగా చిన్న కంపెనీలు దాదాపు రూ.3500 కోట్లకు పైగా పెట్టుబడులను సమీకరించినట్లు మీలా జయదేవ్ వెల్లడించారు. ఇందులో చాలా కంపెనీలు పెట్టుబడిదారులకు అధిక లాభాలు వచ్చేలా చేశాయని అన్నారు.
AZADI KA AMRIT: ప్రగతి బాటలో పరిశ్రమలు.. మున్ముందు ఉజ్వల భవిత!
"సెబీతోపాటు (SEBI) ఇతర స్టాక్ మార్కెట్ ఎక్స్ఛేంజీల్లో పర్యవేక్షణ పెరగడం వల్ల, చిన్న కంపెనీలు సైతం ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి కేవలం 15 కంపెనీలు మాత్రమే ఐపీఓకు వెళ్లాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహించేందుకు ఫిక్కీ తరఫున సహకారం అందిస్తాం. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఇతర రాష్ట్రాల మాదిరిగా ప్రోత్సహించాలి. ఈ తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం అందించేందుకు, కొన్ని రాష్ట్రాల్లో రూ.30 లక్షల సబ్సిడీని కూడా అందిస్తున్నారు." అని మీలా జయదేవ్ తెలిపారు.
దేశ ఆర్థిక వృద్ధి క్రమంగా పెరుగుతూ వస్తోంది :దేశ ఆర్థిక వృద్ధి క్రమంగా పెరుగుతూ వస్తోందని క్యాపిటల్ మార్కెట్స్, ఇన్వెస్టర్స్ ఛైర్మన్ కృష్ణకుమార్ మహేశ్వరి పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా 7.6 శాతం వృద్ధి నమోదు చేసిందని తెలిపారు. స్టాక్ మార్కెట్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎంతో వృద్ధిని నమోదు చేస్తున్నాయని, పెట్టుబడుల కోసం పబ్లిక్‌లోకి వెళ్లడానికి ఇదే సరైన సమయమని ఆయన సూచించారు.దేశ జీడీపీ (India GDP) నాలుగు ట్రిలియన్ మార్కెట్లు దాటిపోయిందని, ఇంకా ఎన్నో పుష్కల అవకాశాలు ఉన్నాయని యూనిస్టోన్ క్యాపిటల్ డైరెక్టర్ బ్రిజేశ్ పారేఖ్ తెలిపారు.