హైదరాబాద్ మహానగరంలో డిసెంబరు 15వ తేదీ నుంచే ఉచిత తాగునీటి పథకం అమల్లోకి వచ్చింది కదా.. మీటర్లు తరువాత పెట్టుకుందాములే అన్న ధోరణిలో చాలామంది నల్లాదారులు ఉన్నారు. ఇలాంటి వారికి సర్కారు చిరు జలక్ ఇచ్చింది. ఏ తేదీ నాటికి మీటర్లు అమర్చుకుంటారో ఆ తేదీ నుంచే ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది.
స్పందించడానికే ఇలా...
దేశంలో తొలిసారి దిల్లీలో ఉచిత తాగునీటి పథకం అమల్లోకి వచ్చింది. ఇందుకు మీటర్లను తప్పనిసరి చేసింది. 18 లక్షల తాగునీటి కనెక్షన్లు ఉండగా పూర్తిస్థాయిలో మీటర్లు అమర్చుకోవడానికి నాలుగేళ్లకు పైగా పట్టింది. ఈ పరిస్థితి హైదరాబాద్‌లో రాకూడదని ప్రభుత్వం భావించింది. సరఫరా చేసే ప్రతి నీటి బొట్టుకు కచ్చితమైన లెక్కుండేలా చర్యలు తీసుకోమని పథకం అమలుకు ముందే జలమండలిని ఆదేశించింది. అధికారులు ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా నల్లాదారుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఉచిత నీటి పథకం అమల్లోకి వచ్చేసింది.. అధికారులు నీటి బిల్లులు ఇవ్వడం లేదు కదా... నాలుగైదు నెలల తరువాత మీటర్లు పెట్టుకుందాములే అన్న ధోరణిలో చాలామంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందరూ స్పందించేలా సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఏరోజు అయితే మీటరు అమరుస్తారో ఆ రోజు నుంచి పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేస్తున్నారు.
మీటర్లు లేకపోతే వసూలు ఇలా..
నల్లాదారులకు డిసెంబరు 15 నుంచి మార్చి నెలాఖరు వరకు నీటి వాడకం బిల్లులు ఇవ్వరు. ఏప్రిల్‌లో జలమండలి సిబ్బంది ప్రతి నల్లాదారుడి ఇంటికి తనిఖీలకు వెళ్తారు. మార్చి నెలాఖరు నాటికి ఎవరైతే మీటరు అమర్చలేదో వారందరికీ డిసెంబరు 15 నుంచి మార్చి నెలాఖరు వరకు తాగునీటి బిల్లును ఏకమొత్తంగా అందజేస్తారు. జనవరి నెలాఖరులో మీటర్లు అమరిస్తే డిసెంబరు 15 నుంచి అప్పటి వరకు మాత్రమే బిల్లులను ఇస్తారు. ఆ తరవాత కాలానికి నీటి ఛార్జీలను వసూలు చేయరు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మీటర్లు పెట్టుకున్న వారు అవి పని చేస్తున్నాయో లేదో పరిశీలించాలని అధికారులు సూచించారు.