హైదరాబాద్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కొదవేలేదు. నగరంలో ప్రతి వీధిలో కిరాణ దుకాణాలు, బట్టల దుకాణాలు, మెడికల్ షాపులు, జనరల్ స్టోర్లు ఇలా చాలా రకాల చిన్న తరహా వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. పండగ సీజన్లలో ఈ చిరు వ్యాపారులకు మంచి ఆదాయం వస్తుంది. అయితే కరోనా కారణంగా ఈసారి పరిస్థితులు మారిపోయాయి. లాక్డౌన్ వల్ల కొన్ని నెలల పాటు కార్యకలాపాలు నిలిచిపోయాయి. సడలింపుల అనంతరం దుకాణాలు తెరిచినా.. ప్రజలు నిత్యావసరాలకే పరిమితి కావటం వల్ల వ్యాపారం సరిగ్గా జరగలేదు. ఫలితంగా కనీసం దసరా, దీపావళి సమయాల్లోనైనా కొనుగోళ్లు పెరుగుతాయని వ్యాపారులు ఆశలు పెట్టుకున్నారు. లక్షలు పెట్టి కావాల్సిన సామాన్లు, సరుకులను కొనుగోలు చేసుకున్నారు. దుకాణాల్లో నిల్వ ఉంచారు.
ఇల్లు గడవటమే..
భారీ వర్షాలు వారి ఆశలపై నీళ్లు చల్లాయి. గత వారం నుంచి కురిసిన వర్షాలతో దుకాణాల్లోకి నీరు చేరింది. దీంతో లక్షలు పెట్టి తెచ్చిన సరుకంతా పాడైపోయింది. అప్పు చేసి మరీ తెచ్చిన సరుకంతా వరద కారణంగా పాడైపోయిందని.. ఇల్లు గడవడం కష్టంగా మారిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.