తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీలో తితిదే మార్పులు చేసింది. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలో గల కౌంటర్లలో ఈ నెల 21 సాయంత్రం 5 గంటలకు టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్ కేంద్రాలను మూసి వేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 22, 23, 24వ తేదీలకు సంబంధించిన టోకెన్లను 21న జారీ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించిన నేపథ్యంలో... మార్పు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. కొవిడ్ నిబంధనలు, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్లు ఐదు ప్రాంతాల్లో జారీ చేయనుండటంతో ఏర్పాట్లలో భాగంగా మార్పు చేసినట్లు అధికారులు వివరించారు. ఈ నెల 24 నుంచి జనవరి 3 వరకు తిరుపతిలోని ఐదు ప్రాంతాలలో సర్వదర్శనం టోకెన్లను తీసుకోవచ్చని వెల్లడించారు.
ఆధార్ ఆధారంగా టోకెన్లు జారీ...
తిరుపతి స్థానికులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లను కేటాయించాలని నిర్ణయించిన తితిదే.... ఆధార్ కార్డుల ఆధారంగా లక్ష దర్శన టోకెన్లను జారీ చేయనుంది. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రాల వద్ద రద్దీని నియంత్రించేందుకు ఇతర ప్రాంతవాసులకు టోకెన్ల జారీ చేయకూడదని నిర్ణయించినట్లు తితిదే ప్రకటించింది.