తెలంగాణలో లాక్డౌన్ అమలవుతున్న సందర్భంగా బ్యాంక్ పని వేళలు, పరిమిత సంఖ్యలో ఉద్యోగుల హాజరు, వ్యాక్సినేషన్ అంశాలపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అత్యవసరంగా సమావేశమై చర్చించింది. జూమ్ యాప్ ద్వారా ఎస్ఎల్బీసి ఛైర్మన్ ఓపీ మిశ్రా నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో.. వివిధ బ్యాంకులకు చెందిన కమిటీ సభ్యులు అభిప్రాయాలు వెల్లడించారు.
లాక్డౌన్ అమలు రోజుల్లో బ్యాంకుల పనివేళలపై చర్చ - తెలంగాణలో బ్యాంకులు పనిచేయు వేళలు
లాక్డౌన్ అమలు రోజుల్లో పనివేళలు, పని గంటలపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమైంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే పనివేళలు చేయాలని సూచించారు. ఉద్యోగులు అందరికి కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని తీర్మానించాయి.
లాక్డౌన్ విధింపు సమయంలో బ్యాంక్‌ల కార్యకలాపాలపై ప్రధానంగా చర్చించారు. బ్యాంకు పని వేళలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండేలా చూడాలని ఎస్ఎల్బీసీ కన్వీనర్ కృష్ణశర్మ సూచించారు. నాబార్డు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సైతం పని వేళలు మధ్యాహ్నం 12 గంటల వరకే ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశాయి. మొదటి రెండు గంటలు ఖాతాదారులకు సేవలు.. ఆ తరువాత రెండు గంటలు అంతర్గత పనులు చేసుకోడానికి సరిపోతుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. వయస్సుతో నిమిత్తం లేకుండా ఉద్యోగులందరికి వ్యాక్సిన్ ఇచ్చేలా చూడాలని సభ్యులు సూచించారు. 50శాతం ఉద్యోగులతో పని చేసే విషయాన్ని ఆయా బ్యాంకులకు వదిలేసిన ఎస్ఎల్బీసీ.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనుంది.
ఇదీ చూడండి:ఆక్సిజన్ అసలు కథ తెలుసా?