తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR Davos Tour: దావోస్​ వేదికగా రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ.. - minister ktr news

KTR Davos Tour: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ ముందుకొచ్చింది. దావోస్​లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్టాడ్లర్ రైల్ అనే సంస్థ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. మరోవైపు రాష్ట్రంలో మరో తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ష్నైడర్ ఎలక్ట్రిక్ కంపెనీ సిద్ధమైంది. స్విట్జర్లాండ్​కు చెందిన ఫార్మా కంపెనీ ఫెర్రింగ్ ఫార్మా కంపెనీ కూడా రాష్ట్రంలో తన కార్యకలాపాలను విస్తరించనుంది.

KTR Davos Tour: తెలంగాణలో మరో బడా కంపెనీ భారీ పెట్టుబడి
KTR Davos Tour: తెలంగాణలో మరో బడా కంపెనీ భారీ పెట్టుబడి

By

Published : May 25, 2022, 3:54 PM IST

Updated : May 25, 2022, 6:12 PM IST

KTR Davos Tour: తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ వెయ్యికోట్లు పెట్టుబడి పెట్టనుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్టాడ్లర్ రైల్ అనే సంస్థ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. దావోస్​లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో నూతనంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ ముందుకొచ్చింది. రాష్ట్రంలో ఉన్న మేదో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, స్టాడ్లర్ రైల్ కలిసి ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని స్థాపించనున్నాయి. ఈ మేరకు స్టాడ్లర్ రైల్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు అన్స్​గార్డ్ బ్రోక్ మెయ్, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్​లు దావోస్​లోని తెలంగాణ పెవిలియన్​లో అవగాహన ఒప్పందంపై మంత్రి కేటీఆర్ సమక్షంలో సంతకాలు చేశారు.

రానున్న రెండు సంవత్సరాల్లో తెలంగాణలో వెయ్యి కోట్ల రూపాయలను రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థాపన కోసం కంపెనీ పెట్టుబడిగా పెట్టనుంది. ఈ కంపెనీ ఫ్యాక్టరీ స్థాపన తర్వాత తయారుచేసే రైల్వే కోచ్​లను కేవలం భారతదేశం కోసం మాత్రమే కాకుండా ఏషియా పసిఫిక్ రీజియన్​లకు సైతం ఎగుమతి చేయనున్నట్లు తెలిపింది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ముందుకు వచ్చిన స్టాడ్లర్ రైల్ కంపెనీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కంపెనీ పెడుతున్న వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి ద్వారా 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న తమ యూనిట్ అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా మారబోతుందని..కంపెనీ కార్యనిర్వాహక అధ్యక్షులు అన్స్​గార్డ్ బ్రోక్ మెయ్ తెలిపారు. తమ కంపెనీ ఏషియా పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధిని సాధించేందుకు ఈ పెట్టుబడి దోహదపడుతుందన్నారు.

ష్నైడర్ ఎలక్ట్రిక్ కంపెనీ మరో యూనిట్:రాష్ట్రంలో మరో తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రముఖ ఎలక్ట్రిక్ సంస్థ ష్నైడర్ కంపెనీ ప్రకటించింది. దావోస్​లోని తెలంగాణ పెవిలియన్​లో మంత్రి కేటీఆర్​తో సమావేశమైన ష్నైడర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లుక్ రిమోంట్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఇప్పటికే తెలంగాణలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న తమ యూనిట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ఫ్యాక్టరీగా అడ్వాన్స్డ్ లైట్ హౌస్ అవార్డును దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పొందిందని రిమోంట్ గుర్తు చేశారు. ఐఐఓటీ ఇన్ ఫ్రా, ప్రెడిక్టివ్, ప్రెస్క్రిప్టివ్ అనలిటిక్స్, ఏఐ డీప్ లెర్నింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలను వాడినందుకు అవార్డు దక్కినట్లు వివరించారు.

తెలంగాణలో తమ కంపెనీ కార్యకలాపాలు సాఫీగా కొనసాగుతున్నాయన్న ఆయన... రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల స్నేహపూర్వక వాతావరణంపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో ఉన్న ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటిస్తున్నట్లు రిమెంట్ తెలిపారు. అత్యున్నత స్థాయి ప్రమాణాలతో రెండో తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన ఆయన... కొత్త ప్లాంటు నుంచి ఎనర్జీ మేనేజ్​మెంట్, ఆటోమేషన్ ఉత్పత్తులను తయారు చేయబోతున్నట్లు చెప్పారు. హైదరాబాద్​ను పెట్టుబడులకు రాజధానిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్న మంత్రి కేటీఆర్... ష్నైడర్ ఎలెక్ట్రిక్ తన తయారీ పరిశ్రమను విస్తరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ష్నైడర్ ఎలక్ట్రిక్ అదనపు తయారీ యూనిట్​తో వెయ్యి మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. తెలంగాణలో కార్యకలాపాలు విస్తరిస్తున్న కంపెనీకి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

కార్యకలాపాలను విస్తరించనున్న ఫెర్రింగ్​ ఫార్మా: స్విట్జర్లాండ్​కు చెందిన ఫార్మా కంపెనీ ఫెర్రింగ్ ఫార్మా కంపెనీ రాష్ట్రంలో తన కార్యకలాపాలను విస్తరించనుంది. సుమారు 500 కోట్ల రూపాయలు, 60 మిలియన్ యూరోలతో విస్తరణ ప్రణాళికలను కంపెనీ ప్రకటించింది. దావోస్​లోని తెలంగాణ పెవిలియన్​లో మంత్రి కేటీఆర్​తో ఫెర్రింగ్ ఫార్మా కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు అల్లేసండ్రో గిలియో, ప్రతినిధి బృందం సమావేశమైంది. భారతదేశంలో తన విస్తరణ ప్రణాళికలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నట్లు ప్రకటించింది. క్రోన్, అల్సారేటివ్ కోలైటిస్ వంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగించే తన ట్రేడ్ మార్క్ పెంటసాను ఉత్పత్తి చేసేందుకు నూతన ప్లాంట్​ను వినియోగించుకున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రపంచంలోనే అతి పెద్ద మేసాలజైన్, ఏపీఐ తయారీదారుల్లో ఒకటిగా ఉన్న ఫెర్రింగ్ ఫార్మా ప్రస్తుతం వివిధ దేశాల నుంచి తన ఉత్పత్తులను తయారు చేస్తుంది. వీటికి అదనంగా హైదరాబాద్ నగరంలో తన ఫార్ములేషన్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఫెర్రింగ్ కంపెనీ తెలిపింది.

ఫెర్రింగ్ ఫార్మా హైదరాబాద్​లో తన విస్తరణ ప్రణాళికలు ప్రకటించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేవలం నెలరోజుల క్రితమే కంపెనీ యూనిట్​ను హైదరాబాద్​లో ప్రారంభించానని, ఇంత త్వరగా కంపెనీ అదనంగా మరో 60 మిలియన్ల యూరోల పెట్టుబడిగా పెట్టడం తెలంగాణలో ఉన్న అపార పెట్టుబడి అవకాశాలకు నిదర్శనమని అన్నారు. కేవలం దేశీయ కంపెనీలకే కాకుండా అంతర్జాతీయ విదేశీ కంపెనీలకు సైతం తెలంగాణ అత్యంత అనుకూలంగా ఉందనే విషయాన్ని ఈ పెట్టుబడి ప్రకటన నిరూపిస్తోందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాపార, వాణిజ్య, ఉపాధి కల్పన అనుకూల కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. తెలంగాణలో విస్తరణకు పెట్టుబడి పెడుతున్న ఫెర్రింగ్ ఫార్మా కంపెనీకి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : May 25, 2022, 6:12 PM IST

ABOUT THE AUTHOR

...view details