తెలంగాణ

telangana

ETV Bharat / state

Uppal: కొత్త అందం సంతరించుకున్న ఉప్పల్ చౌరస్తా.. త్వరలో స్కైవాక్ ప్రారంభం

Uppal Skywalk Latest Update: జంటనగరాల్లో పాదచారుల కోసం... ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఉప్పల్‌ సర్కిల్‌లో నిర్మిస్తున్న స్కైవాక్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఉప్పల్‌ జంక్షన్‌లో వాహనాలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని హెచ్​ఎండీఏ పాదాచారుల వంతెన నిర్మిస్తోంది. ఆ స్కైవాక్‌ అందుబాటులోకి వస్తే పాదచారులు... రోడ్డు దాటే ఇబ్బందులు తొలగిపోనుండగా వాహనదారులు సైతం సాఫీగా వెళ్లే అవకాశం కలగనుంది. అన్ని కూడళ్ల నుంచి ప్రజలు నేరుగా మెట్రో స్టేషన్‌కి చేరుకునేలా అనుసంధానించారు.

Uppal Skywalk
Uppal Skywalk

By

Published : May 1, 2023, 11:22 AM IST

కొత్త అందం సంతరించుకున్న ఉప్పల్ చౌరస్తా.. త్వరలో స్కైవాక్ ప్రారంభం

Uppal Skywalk Latest Update: అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉప్పల్‌ చౌరస్తా ఒకటి. కళాశాలలకు వెళ్లే... యువతీ, యువకులు, వరంగల్‌ తదితర చోట్ల నుంచి వచ్చే ప్రజలు... మెట్రోలో ప్రయాణించే నగర వాసులతో ఆ ప్రాంతం అంతా కిటకిటలాడుతుంది. రద్దీ ఎక్కువగా ఉండటంతో రోడ్డు దాటే క్రమంలో వాహనదారులు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాంటి వాటికి చెక్‌పెట్టేందుకు 25కోట్లు వెచ్చించి... ఉప్పల్‌ చౌరస్తాలో హెచ్​ఎండీఏ స్కైవాక్‌ నిర్మిస్తోంది.

అన్ని కూడళ్ల నుంచి మెట్రో స్టేషన్‌కి చేరుకునేలా అనుసంధానం:660మీటర్ల మేర ఏర్పాటు చేస్తున్న ఆ వంతెన... అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు పెద్దఊరట లభించనుంది. ఉప్పల్‌, సికింద్రాబాద్‌, ఎల్​బీ నగర్‌, రామంతాపూర్‌ మార్గంలోని రహదారులు, మెట్రోస్టేషన్‌తో ఆ వంతెనను అనుసంధానించారు. ఉప్పల్‌ మెట్రో మార్గంలో రోజు సుమారు 30 వేల మంది ప్రయాణిస్తారు. వారందరి గమ్యస్థానాలకు సులభంగా చేరుకునేలా అవకాశం కలగనుంది. మెట్లు ఎక్కలేని వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లల కోసం ఎస్కలేటర్లు, లిఫ్టుసౌకర్యం కల్పిస్తున్నారు.

ఈనెలలో అందుబాటులోకి తెచ్చేలా అధికారుల ప్రయత్నాలు:ఉప్పల్‌ చౌరస్తాలో రోజూ సుమారు 20 వేల మందికి పైగా పాదచారులు రోడ్డు దాటుతారని అంచనా. అందుకు అనుగుణంగా 640 మీటర్ల పొడవు, 3-4 మీటర్ల వెడల్పు, 8 లిఫ్టులు, 6 మెట్ల మార్గాలు... 12 ఎస్కలేటర్లు, 4 ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఏర్పాటుచేశారు. వంతెన సుందరీకరణ కోసం పై భాగంలో కేవలం 40శాతం మేర రూఫ్‌కవరింగ్‌ ఏర్పాటుచేశారు. రామంతాపూర్‌, నాగోల్‌ రోడ్లు, జీహెచ్​ఎంసీ థీమ్‌ పార్క్‌, వరంగల్‌ బస్టాప్‌, ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌, ఎమ్​ఆర్వో ఆఫీస్‌, సబ్‌స్టేషన్‌ అనుసంధానించి నిర్మిస్తున్న స్కైవాక్ ఈనెలలో అందుబాటులోకి తెచ్చేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీగా మారనున్న ఉప్పల్ చౌరస్తా:ఉప్పల్‌ స్కైవాక్‌ అందుబాటులోకి వస్తే పాదచారులకు ఇబ్బంది తొలగిపోవటంతో పాటు ట్రాఫిక్‌ సిగ్నల్‌ ఫ్రీ చౌరస్తాగా మారనుంది. ఇకపైన ఉప్పల్ మెట్రో రైలు ప్రయాణీకులు మెట్రో కాన్ కోర్ నుంచి పాదచారుల వంతెన మీదుగా వారి అవసరాలకు అనుగుణంగా వారి వారి గమ్య స్థానాల వైపు వెళ్లేందుకు అవకాశం కలుగుతుంది. ఉప్పల్‌ స్కైవాక్ ఫలితాల ఆధారంగా నగరంలోని మిగతా కూడళ్లలో ఈ తరహా వంతెనల నిర్మాణానికి హెచ్​ఎండీఏ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details