Skywalk at Uppal available soon: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే నగరంలో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, బ్రిడ్జ్‌లు అందుబాటులోకి రావడంతో ప్రధాన ఏరియాల్లో ట్రాఫిక్ కొంత మేర తగ్గింది. మరోవైపు కాలిబాటన నడిచేవారికి కూడా సర్కార్ అధిక ప్రధాన్యతను ఇస్తోంది. ప్రతి ఏడాది జంట నగరాల్లో వందల సంఖ్యలో కాలిబాటన వెళ్లే వారు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి పునరావృతం కాకుండా ఇప్పటికే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. వాటితో పాటు ఉప్పల్ చౌరస్తాలో కాలినడకన రోడ్డు దాటే వారి కోసం ప్రత్యేకమైన స్కైవాక్‌ను నిర్మిస్తున్నారు. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో వాహనాలు తిరగటం.. చౌరస్తా పెద్దగా ఉండడంతో రోడ్డు దాటాలంటే పాదచారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకే నిర్మిస్తున్న స్కైవాక్ పనులు పస్తుతం 85శాతం పూర్తయ్యాయి.
స్కైవాక్ నిర్మాణానికి ఎంత కేటాయించారు?:ఉప్పల్ జంక్షన్‌లో వాహనాలతో పాటు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ స్కైవాక్ నిర్మాణానికి హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ శ్రీకారం చుట్టింది. 640 మీటర్ల, వెడల్పు 3-4 మీటర్లు మేర ఏర్పాటు చేస్తున్న ఉప్పల్ స్కైవాక్‌కు రూ.25కోట్లు కేటాయించారు. కరోనా కారణంగా కాస్త ఆలస్యం అయినా.. కొంతకాలంగా పనులు చురుకుగా సాగుతున్నాయి. ఉప్పల్, సికింద్రాబాద్, ఎల్బీనగర్ రహదారులకు ఈ వంతెనను అనుసంధానించారు.