తెలంగాణ

telangana

ETV Bharat / state

Skoch award 2021: హైదరాబాద్​ పోలీసులకు 'స్కోచ్‌' పురస్కారం - Skoch award for telangana police

హైదరాబాద్‌ పోలీసుల సేవలకు గుర్తింపుగా.. ప్రతిష్ఠాత్మక స్కోచ్​ పతకం వరించింది. మంగళవారం వర్చువల్‌ పద్ధతిలో జరిగిన ‘స్కోచ్‌ సమ్మిట్‌-2021’లో నగర సీపీ అంజనీ కుమార్‌ ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

Skoch award
Skoch award

By

Published : Nov 17, 2021, 9:08 AM IST

హైదరాబాద్‌ నగర పోలీసులను ప్రతిష్ఠాత్మక ‘స్కోచ్‌’ పురస్కారం వరించింది. ప్రజామిత్ర పోలీసింగ్‌లో భాగంలో చేపట్టిన ‘ప్రీ-రిక్రూట్‌మెంట్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాం’కు ‘పోలీస్‌, భద్రతా’ విభాగంలో ఈ అవార్డు దక్కింది. మంగళవారం వర్చువల్‌ పద్ధతిలో జరిగిన ‘స్కోచ్‌ సమ్మిట్‌-2021’లో నగర సీపీ అంజనీ కుమార్‌ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నిరుపేద కుటుంబాలకు చెందిన యువకులను ఎంపిక చేసుకుని పోలీసు ఉద్యోగాలకు ముందస్తు శిక్షణ ఇస్తున్నారు. 2015 మార్చి 1న ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తొలి బ్యాచ్‌లో 267 మంది ఎంపికయ్యారు. ఇప్పటివరకు 5 వేల మందికి శిక్షణ ఇప్పించగా.. 1017 మంది పోలీసు ఉద్యోగాలు సాధించారు. జాబ్‌ కనెక్ట్‌, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ అనే మరో రెండు ప్రాజెక్టులు ఫైనల్స్‌ వరకు వెళ్లినట్లుగా అంజనీ కుమార్‌ తెలిపారు.

రవాణా శాఖకు...

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: పౌరసేవల్లో రవాణా శాఖకు స్కోచ్‌ అవార్డు (సిల్వర్‌) దక్కింది. ఎక్కడైనా, ఎప్పుడైనా సేవల్లో అత్యుత్తమ పనితీరును గుర్తిస్తూ 2020-21 ఏడాదికి స్కోచ్‌ గ్రూప్‌ ఈ పురస్కారం ప్రకటించిందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం రవాణా శాఖ కమిషనర్‌ ఎంఆర్‌ఎంరావు ఆన్‌లైను వేదికగా అవార్డును స్వీకరించారు. జాతీయ స్థాయి అవార్డు రావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ పారదర్శకత, సౌకర్యవంతమైన సేవలు అందిస్తున్నామని వివరించారు. కొత్త డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, పునరుద్ధరణ, ట్రేడ్‌ సర్టిఫికెట్లు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ బ్యాడ్జి, స్మార్ట్‌ కార్డు, లైసెన్స్‌ హిస్టరీ షీట్‌, గడువు తీరిన ఎల్‌ఎల్‌ఆర్‌ స్థానంలో కొత్తవి మంజూరు, వాహన తరగతిని చేర్చడం వంటి సేవల్ని మొబైల్‌ యాప్‌ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: తెలంగాణ పోలీసులకు స్కోచ్​ బంగారు పతకం

ABOUT THE AUTHOR

...view details