ప్రభుత్వం పోలీసు శాఖలో పలు సంస్కరణలు చేపట్టింది. మొదట్లో పోలీస్ స్టేషన్ నిర్వహణ కోసం అతి తక్కువ డబ్బులిచ్చేవారు. కానీ తెరాస ప్రభుత్వం నగరాల్లోని ఒక్కో పోలీస్ స్టేషన్ నిర్వహణ కోసం ఇచ్చే డబ్బులను 10 రెట్లు పెంచింది. పోలీసు శాఖను బలోపేతం చేసేందుకు ఉద్యోగ నియామకాలు చేపట్టింది. 2014 జూన్‌లో పోలీసు శాఖలో 8,447 పోలీస్ కానిస్టేబుల్స్ నియామకాలు జరిగాయి.
ఉద్యోగాలు..
2017లో రాష్ట్రంలో ఏర్పాటైన నూతన జిల్లాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పోలీసు శాఖలో 18,290 పోస్టులను మంజూరు చేసింది. మరోమారు 2018 ఫిబ్రవరి 3న వివిధ హోదాల్లో మరో 14,177 ఉద్యోగాల భర్తీకి అనుమతినిస్తూ హోంశాఖ కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. అభ్యర్థుల కనీస వయోపరిమితిని మూడేళ్లు పెంచారు. ఇది వరకు రాష్ట్రంలో రెండు పోలీస్ కమీషనరేట్లు మాత్రమే ఉండేవి. ప్రభుత్వం కొత్తగా ఏడు పోలీస్ కమీషనరేట్లన్లను నెలకొల్పింది. హోంగార్డుల వేతనాలను సైతం భారీగా పెంచింది. 18,491 హోంగార్డుల వేతనాలు పెంచడంతో అనేక ఇతర సౌకర్యాలూ కల్పించారు. ఆరేళ్ల క్రితం రూ.6వేలుగా ఉన్న హోంగార్డుల వేతనం ప్రస్తుతం రూ. 20 వేలకు చేరుకుంది. ట్రాఫిక్ పోలీసులకు కాలుష్య అలవెన్స్ కింద అదనంగా 30 శాతం వేతనం అందిస్తున్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు అందించే సాయం పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ హోదా వరకు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబానికి ఇస్తున్న పరిహారాన్ని రూ.25 నుంచి రూ.40 లక్షలకు పెంచారు. ఎస్సై హోదా అధికారి చనిపోతే రూ.25 నుంచి రూ.45 లక్షలకు, సీఐ, డీఎస్పీ, అడీషినల్ ఎస్పీ హోదా గల అధికారులు మృతి చెందితే ఇస్తున్న మొత్తం రూ. 30 నుంచి రూ.50 లక్షల వరకు, ఎస్పీ స్థాయి లేదా ఐపీఎస్ అధికారి మృతి చెందితే రూ.50 లక్షల నుంచి రూ.ఒక కోటికి పెంచారు.
కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం
దేశంలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడుకున్న మొదటి పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బంజారాహిల్స్‌లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న జంట భవనాల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్, కమాండ్, కంట్రోల్ సెంటర్‌ను రూ.350 కోట్ల వ్యయంతో 7 ఎకరాల విస్తీర్ణంలో.. 6 లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో లక్ష సీసీ పుటేజీలని ఒక్క నిమిషంలోనే పరిశీలించే ఆధునిక పరికరాలు, పరిజ్ఞానం అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్‌లో రోజురోజుకూ ఎక్కువవుతున్న ట్రాఫిక్ రద్దీని శాస్త్రీయ పద్ధతిలో క్రమబద్ధీకరించేందుకు ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దేశంలోనే తొలిసారిగా అనుమానితుల ఫోటోలు క్షణాల్లో సరిపోల్చే ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. నేరస్థులతోపాటు, అనాథ శవాలను, తప్పిపోయినవారిని కూడా దీంతో గుర్తిస్తున్నారు. నేను సైతం కార్యక్రమాన్ని అమలు చేస్తున్న పోలీసులు... పౌరసమాజం సహకారంతో కాలనీల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లోనూ నేనుసైతం కార్యక్రమాన్ని విస్తరించారు. దేశవ్యాప్తంగా పోలీసులు ఉపయోగిస్తున్న 4,27,529 కెమెరాల్లో 2020 మార్చి నాటికి 66 శాతం.. అంటే 2,75,528 కెమెరాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్స్ నివేదికలో పేర్కొన్నట్లు ప్రభుత్వం తెలిపింది.