తెలంగాణ

telangana

ETV Bharat / state

ముఠా కూలీ నుంచి రచయితగా.. ఓ చరిత్రకారుడి ప్రస్థానం - AP Highlights

Manimela Sivashankar: ఆయన ఓ సాధారణ ముఠా కూలీ. మూటలు మోయటమే వృత్తి. కానీ చరిత్రపై ఉన్న ఆసక్తి అతడిని ఓ రచయితగా మార్చింది. చదివింది ఐదో తరగతే అయినా.. శాసనాలను పరిశీలించి, అందులోని విషయాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించారు. అంతటితో ఆగపోలేదు. కాలగర్భంలో కలిసిపోయిన 500 గ్రామాల చరిత్రను వెలికితీశారు. ఎలాంటి డిగ్రీలు లేకపోయినా పరిశోధకుల కన్నా మిన్నగా శ్రమించి అదృశ్య గ్రామాల చరిత్రకు అక్షరరూపం ఇచ్చి ఓ పుస్తకంగా మార్చారు. ముఠా కూలీ నుంచి చరిత్రకారుడిగా మారిన ఏపీలోని గుంటూరు జిల్లా వాసిపై ప్రత్యేక కథనం.

Manimela Sivashankar
Manimela Sivashankar

By

Published : Jan 13, 2023, 5:19 PM IST

ముఠా కూలీ నుంచి రచయితగా.. ఓ చరిత్రకారుడి ప్రస్థానం

Manimela Sivashankar: ఓ వైపు బస్తాలు మోస్తూ ముఠా కూలీగా.. మరోవైపు పుస్తకాలు రాస్తూ చరిత్రకారుడిగా.. రెండు విభిన్న కోణాల్లో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు మణిమేల శివశంకర్‌. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్ల మండలం భర్తిపూడి గ్రామంలో జన్మించారు. పేద కుటుంబంలో పుట్టిన శివశంకర్‌ 5వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. జీవనోపాధి కోసం గుంటూరు వచ్చి ముఠా కార్మికుడిగా స్థిరపడ్డారు. తరచూ ఆలయాలకు వెళ్లే శివశంకర్.... అక్కడి స్థలపురాణం, చరిత్ర గురించి ఆరా తీసేవారు. ఆలయ ప్రాంగణాల్లో శాసనాలుంటే వాటిలోని అంశాల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపేవారు.

ప్రతి రోజూ పని పూర్తవగానే శాసనాల అన్వేషణ కోసం తిరుగుతుంటారు. ఇలా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 500 అదృశ్య గ్రామాల పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర, సంస్కృతి వివరాలను సేకరించగలిగారు. మండలాల వారీగా అదృశ్య గ్రామాల వివరాలను ‘గుంటూరు జిల్లా అదృశ్య గ్రామాలు’ పేరుతో గ్రంథస్థం చేశారు. అదృశ్య గ్రామాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తికి తన చిన్న వయసులోనే బీజం పడిందని శివశంకర్ చెబుతున్నారు.

జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య పూర్వీకుల గ్రామమైన పింగళి గురించి పుస్తకంలో పొందుపరిచారు. సినీకవి పింగళి నాగేంద్రరావు, అష్టదిగ్గజాల్లో ఒకరైన పింగళి సూరనకవి విశేషాలను తెలియజేశారు. అదృశ్య గ్రామాల గురించి పరిశోధన చేసే క్రమంలో ఎన్నో ఆసక్తికర విషయాలు శివశంకర్ దృష్టికి వచ్చాయి. గ్రామాలు అదృశ్యం కావటానికి 20 రకాల కారణాలను ఆయన గుర్తించారు.

శివశంకర్ పరిశోధనకు ప్రధాన ఆధారం శాసనాలు. పాత తెలుగు శాసనాలను చదివి అర్థం చేసుకోవటంలో పట్టు సాధించారు. సంస్కృతం తెలిసిన మిత్రుల ద్వారా శాసనాల్లోని అంశాల గురించి తెలుసుకున్నారు. సమాచార సేకరణ కోసం చాలా పుస్తకాలు కొన్నారు. మరికొన్ని మిత్రుల ద్వారా సేకరించారు. ప్రస్తుతం ఆ పుస్తకాలు ఓ చిన్నపాటి గ్రంథాలయాన్ని తలపిస్తున్నాయి. ఎవరైనా పుస్తకాలు రాసేవారికి రెఫరెన్స్‌కు అవసరమైన సమాచారం శివశంకర్ అందిస్తుంటారు. పుస్తకం రాసే క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డానని ఆయన తెలిపారు. కూలీ పని చేస్తూనే సమాచార సేకరణ, విశ్లేషణ, రచన సాగించటం అత్యంత శ్రమతో కూడిన వ్యవహారంగా చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details