తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. ఇటీవలే ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సోమయాజి, నందకుమార్ ను రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించింది. విచారణ సందర్భంగా నిందితుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఇవాళ సాయంత్రం సిట్ అధికారులు.. నందకుమార్‌కు చెందిన ఫిలింనగర్‌లోని దక్కన్ హోటల్లో తనిఖీలు నిర్వహించారు. రామచంద్రభారతి, సింహయాజి ఇదే హోటల్‌లో బస చేసినట్టు గుర్తించారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను సేకరిస్తున్నట్టు సమాచారం.
హోటల్‌కు నిందితులు ఎప్పుడు వచ్చారు? వారితో ఎవరెవరు వచ్చారు? ఎన్ని రోజులు బస చేశారు? అనే కోణంలో సిట్ అధికారులు దృష్టిసారించారు. ప్రధాన నిందితుడు రామచంద్రభారతి గత నెల 26న దిల్లీ నుంచి విమానంలో వచ్చినట్టు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. రామచంద్రభారతితో పాటు దిల్లీ నుంచి ఇంకా ఎవరైనా వచ్చారా? అని ఆరా తీస్తున్నారు. పైలట్ రోహిత్‌రెడ్డికి రూ.100 కోట్లు, మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలకు రూ.50కోట్ల చొప్పున ఇస్తామని రామచంద్రభారతి చెప్పినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. దిల్లీ నుంచి డబ్బులు తెచ్చారా? రామచంద్రభారతితో పాటు వచ్చిన వ్యక్తులు హోటల్‌లో బస చేశారా? అనే వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. సిట్ బృందం దర్యాప్తు మొత్తం రామచంద్రభారతి కేంద్రంగానే కొనసాగుతోంది.