SIT Investigation in Data Theft Case: వ్యక్తిగత డేటా చోరీ కేసులో నిందితులు వేలాది మందికి సమాచారం విక్రయించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నాగ్‌పూర్‌కు చెందిన జియా ఉర్ రెహ్మాన్ నుంచి మిగిలిన ఆరుగురు డేటా కొనుగోలు చేశారు. దాదాపు ఏడాదిగా ఈ దందా కొనసాగిస్తున్నారు. నిందితులు దిల్లీ సమీపంలోని నోయిడాలో కాల్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఏడాది కాలంగా ఈ వ్యవహారం నడుస్తున్నా.. స్థానిక పోలీసులు గుర్తించలేకపోయారు.
Data Theft Case Updates: ప్రస్తుతం డేటా చోరీ బయటపడటంతో ఇతర రాష్ట్రాల పోలీసులు సైబరాబాద్ పోలీసులను సంప్రదిస్తున్నారు. దిల్లీ పోలీసులు సైబరాబాద్ పోలీసులతో మాట్లాడారు. భారత్‌లో జరిగే సైబర్ మోసాల్లో చైనా మూలాలుంటున్నాయి. ఈ క్రమంలో డేటా ఏమైనా చైనా సైబర్ నేరగాళ్లకు చేరిందా అనే విషయమై పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు ఉపయోగించిన బ్యాంకు లావాదేవీలను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. లావాదేవీల కోసం ఇతరుల బ్యాంకు ఖాతాలు వినియోగించారా అనే కోణంలోనూ విచారిస్తున్నారు.
డేటా విక్రయం ద్వారా కూడబెట్టిన ఆస్తుల గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నిందితుడు కుమార్ నితీశ్ భూషణ్ నోయిడాలో ఇల్లు, బంగారం కొనుగోలు చేసినట్టు సిట్ గుర్తించింది. ఇతర నిందితులు కూడా ఇదే విధంగా ఏమైనా ఆస్తులు సమకూర్చుకున్నారా అనే అంశంపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. డేటా చోరీ కేసులో అరెస్టయిన నిందితుల పోలీసు కస్టడీ కోసం సిట్ అధికారులు కోర్టు అనుమతి తీసుకోవడానికి సిద్దమవుతున్నారు.