TSPSC Paper Leak Case Latest Updates: రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సిట్ అధికారులు నిందితులను ప్రశ్నిస్తున్నారు. నాంపల్లి కోర్టు అనుమతితో షమీమ్, రమేష్, సురేష్లను సిట్ అధికారులు చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత.. హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. గ్రూప్- 1 ప్రిలిమ్స్‌లో షమీమ్‌కు 126 మార్కులు, రమేష్‌కు 122, సురేష్‌కు 100కు పైగా మార్కులొచ్చాయి.
నిందితుల ద్వారా ఇంకెవరికైనా ప్రశ్నాపత్రం వెళ్లిందా: రాజశేఖర్ రెడ్డి , ప్రవీణ్‌ల ద్వారా ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రాన్ని ముగ్గురు నిందితులు తీసుకున్నట్లు సిట్ అధికారులు ఇప్పటికే తేల్చారు. వీరి ద్వారా ఇంకెవరికైనా ప్రశ్నాపత్రం వెళ్లిందా అనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు ముగ్గురిని వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. నేటి నుంచి 5 రోజుల పాటు వీరిని సిట్ అధికారులు ప్రశ్నిస్తారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 100కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు సిట్ కార్యాలయానికి వస్తున్నారు.
గత వారం రోజుల నుంచి సిట్ అధికారులు 100కు పైగా మార్కులు సాధించిన అభ్యర్థులను పిలిచి వివరాలు సేకరిస్తున్నారు. 18 అంశాలతో కూడిన పత్రాన్ని ఇచ్చి దాన్ని నింపి ఇవ్వాల్సిందిగా సిట్ అధికారులు సూచిస్తున్నారు. ఆ మేరకు వారు పత్రాలను నింపి సిట్ అధికారులకు ఇచ్చి వెళ్తున్నారు. గతంలో ఎన్నిసార్లు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లారు.. వెళితే ఎవరెవరిని కలిశారు.. ఎక్కడ శిక్షణ తీసుకున్నారు.. చిరునామా, కుటుంబ వివరాలను అభ్యర్థుల నుంచి తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 100పైగా మార్కులు సాధించిన 121 మంది అభ్యర్థుల్లో.. 60మందిని విచారించారు. రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్ న్యూజిలాండ్‌లో ఉండటంతో సిట్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లా సల్కర్‌పేటలో తిరుపతయ్య ఇంటికి వెళ్లిన పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. అతని కుటుంబసభ్యులను ప్రశ్నించారు. గండీడ్ ఎంపీడీవో కార్యాలయంలో వివరాలు సేకరించారు.