ఒకే స్వామీజీ రెండు పాస్‌పోర్టులు SIT investigation in MLA purchase case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఏ1 గా ఉన్న రామచంద్రభారతిపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే రెండేసి ఆధార్ కార్డులు, పాన్‌కార్డులు, డ్రైవింగ్ లైసెన్లు ఉన్నట్లు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 3న కేసు నమోదైంది. తాజాగా సిట్ దర్యాప్తులో రెండు పాస్‌పోర్టులు ఉన్నట్లు తేలింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని సిట్ కార్యాలయంలో దర్యాప్తు సందర్భంగా ఇది బయటపడినట్లు.. కేసు దర్యాప్తు అధికారి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఐపీసీ సెక్షన్ 467, 468, 471లతోపాటు పాస్‌పోర్టు చట్టంలోని సెక్షన్12 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో గత నెల 26న ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ దొరికిపోయిన సమయంలో రామచంద్ర భారతి నుంచి ల్యాప్‌ట్యాప్‌తో పాటు రెండు సెల్ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. వీటిలోని డేటాను రిట్రీవ్ చేసేందుకు వాటిని ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. ఆ నివేదిక ఇటీవలే సిట్ బృందానికి అందింది. దీనిని పరిశీలిస్తున్న క్రమంలో రెండు పాస్‌పోర్టులు ఉన్నట్లు బయటపడింది. ఒకే ఫొటో ఉండి వేర్వేరు పేర్లు, ఇతర వివరాలతో ఉన్న రెండు పాస్‌పోర్టులను అధికారులు గుర్తించారు.
సిట్ అధికారులు ఐఫోన్లో సమాచారాన్ని విశ్లేషించగా ఒక పాస్‌పోర్టు స్వామీజీ శ్రీ రామచంద్ర పేరుతో ఉన్నట్లు తేలింది. తండ్రి పేరు మహాస్వామి శ్రీ మధ్వ ధర్మదత్జీగా ఉంది. కర్ణాటకలోని పుత్తూరు చిరునామాతో ఉన్న ఈ పాస్‌పోర్టులో పుట్టిన తేదీ 12 ఫిబ్రవరి 1979గా ఉంది. దీనిని 2019 నవంబరు 8న జారీ చేసినట్లు ఉంది. ల్యాప్‌ట్యాప్ విశ్లేషణలో మరో పాస్‌పోర్టు ఉన్నట్లు బయటపడింది. భరత్‌కుమార్‌శర్మ పేరుతో ఉన్న ఈ పాస్‌పోర్టు కర్ణాటకలోని కొడగు చిరునామా ఉంది. తండ్రి పేరు శ్రీకృష్ణమూర్తి వెలకుంజగా ఉంది. పుట్టినతేదీ 12 ఫిబ్రవరి 1988గా ఉంది. 2010 జులైలో జారీ అయినట్లుగా ఉంది. ఒక పాస్‌పోర్టు T-9633062 నంబరుతో ఉండగా.. మరొకటి T-3633032తో ఉంది. రెండింటిలోనూ తల్లి పేరు సరస్వతి వెలకుంజ అని ఉంది. రామచంద్ర భారతికి చెందినట్లుగా గుర్తించిన రెండు పాస్పోర్టులల్లో ఒకటి ఫోర్జరీది అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ల్యాప్‌ట్యాప్‌లో గుర్తించిన భరతకుమార్ శర్మది అలా ఉండేందుకు అవకాశముందనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఎవరి పేరుతోనో ఉన్న పాస్‌పోర్టు మొదటి పేజీని మార్ఫింగ్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ పాస్‌పోర్టులపై నిగ్గూతేల్చేందుకు సంబంధిత అధికారులకు లేఖ రాసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఒకవేళా రెండూ.. రామచంద్రభారతికి సంబంధించినవేనని తేలితే స్టాంపింగ్‌లను సైతం పరిశీలించనున్నారు. ఈ రెండింటిలోని వివరాల ఆధారంగా రామచంద్రభారతి ఎక్కడెక్కడికి ప్రయాణించారనే కోణంలోనూ సిట్ అధికారులు సమాచారం సేకరించే పనిలో పడ్డారు.
ఇవీ చదవండి: