తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రశ్నపత్రాల లీకేజీ కేసు... కీలక సమాచారం సేకరించిన సిట్‌!

SIT Custody on Third Day in TSPSC Paper Leakage: టీఎస్​పీస్​సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్‌ బృందం కస్టడీలోని నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టింది. కమిషన్‌ కార్యాలయంలో నెట్‌వర్క్‌ అడ్మిన్‌గా రాజశేఖర్‌ రెడ్డి... గ్రూప్‌ 1 ప్రిలిమినరీ ప్రశ్నపత్రాలు కొట్టేసేందుకు ఎంతో పకడ్బందీగా పథకం వేసినట్టు తాజాగా గుర్తించింది. నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచే రాజశేఖర్‌రెడ్డి ప్రశ్నపత్రాలపై కన్నేశాడని... నెట్‌వర్క్‌ అడ్మిన్‌గా తనకున్న స్వేచ్ఛను వినియోగించుకున్నాడని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో గ్రూప్-1  పరీక్షా పేపర్లు తస్కరించే క్రమంలో నాలుగుసార్లు విఫలమైనట్టు తేలింది.

TSPSC
TSPSC

By

Published : Mar 20, 2023, 8:05 PM IST

Updated : Mar 21, 2023, 6:28 AM IST

SIT Custody on Third Day in TSPSC Paper Leakage: టీఎస్​పీస్​సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో రోజుకో కొత్తకోణం వెలుగులోకి వస్తుంది. నిందితులను ఆరు రోజులు కస్టడీ విచారణలో భాగంగా మూడు రోజులపాటు విచారించిన సిట్ అధికారులు పలు కీలక సమాచారాన్ని రాబట్టారు. మూడోరోజు హిమాయత్‌నగర్‌ సిట్‌ కార్యాలయంలో సిట్‌ చీఫ్‌ ఏ.ఆర్‌.శ్రీనివాస్‌ సారథ్యంలో నిందితులను విచారించారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డిలను సిట్‌ పోలీసులు కమిషన్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ కాన్ఫిడెన్షియల్‌ విభాగంలో నిందితులు యాక్సెస్‌ చేసినట్టు చెప్పిన కంప్యూటర్లను పరిశీలించారు. రాజశేఖర్‌రెడ్డి ఏ విధంగా కంప్యూటర్‌ నుంచి ప్రశ్నపత్రాలు కాపీ చేసుకున్నాడు అందుకు పట్టిన సమయాన్ని గుర్తించారు. ఆయా విభాగాల్లోని సాంకేతిక భద్రతా వైఫల్యం కూడా పోలీసులు ఆరా తీశారు. మూడోరోజు నిందితులను ఒకేచోట కూర్చొబెట్టి వాంగ్మూలం నమోదు చేసుకున్నట్టు సమాచారం.

గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో రాజశేఖర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు తేల్చారు. గ్రూప్‌-1 ప్రశ్నపత్రాలు కమిషన్‌కు చేరినట్టు తెలియగానే వాటిని కొట్టేసేందుకు రాజశేఖర్‌రెడ్డి పథకం సిద్ధం చేసుకున్నాడు. కమిషన్‌ కార్యాలయంలోని కంప్యూటర్లను తన చేతుల్లోకి తెచ్చుకునేందుకు మరమ్మత్తులు, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దానిలో భాగంగానే ఐపీ అడ్రసులు మార్చాడు. కాన్ఫిడెన్షియల్‌ సూపరింటిండెంట్‌ శంకరలక్ష్మి కంప్యూటర్‌ను అనువుగా మలుచుకున్నాడు. గతేడాది గ్రూప్‌1 పరీక్షకు మూడు నెలల ముందు నాలుగుసార్లు ప్రశ్నపత్రాలు కాపీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. గతేడాది అక్టోబరు మొదటివారంలో ఈ ప్రశ్నపత్రాలను చాకచక్యంగా పెన్‌డ్రైవ్‌ల్లోకి కాపీ చేసుకున్నట్టు మూడోరోజు కస్టడీలో సిట్‌ పోలీసులు ఆధారాలు సేకరించినట్టు విశ్వసనీయ సమాచారం. కాపీ చేసిన ప్రశ్నపత్రాలను ఎవరికి విక్రయించాడు. ఎంత సొమ్ము తీసుకున్నాడు. వారి ఫోన్‌నెంబర్లు, వారు ఎక్కడ ఉన్నారనే సమాచారం సేకరించే పనిలో పోలీసులున్నారు.

రాజశేఖర్‌కు యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు ఎలా వచ్చాయన్నది మిస్టరీగా మారింది. దీని గురించి సిట్‌ అధికారులు ఎంతగా ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పడంలేదని తెలుస్తోంది. వీరు వాడిన యూజర్‌ఐడీ, పాస్‌వర్డ్‌ కమిషన్‌కు చెందిన ఓ అధికారిదని అనుమానిస్తున్నారు. ఆ అధికారి నుంచి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను తస్కరించారా లేదా ఆ అధికారే ఇచ్చారా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ ఎవరైనా యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇచ్చి ఉంటే వారినీ విచారించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గత కొద్ది నెలలుగా ప్రవీణ్‌ పలువురుని సంప్రదించినట్లు తెలుస్తోంది. ప్రవీణ్‌ ఫోన్లో సంప్రదింపులు జరిపిన వారందరి వివరాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారు. వీరిలో పోటీ పరీక్షలు రాసివవారు ఉంటే విచారణకు పిలవారని భావిస్తున్నారు. రాజశేఖర్‌ కూడా ఇదే తరహాలో కొద్ది మంది ఎంపిక చేసుకున్న వారికి ప్రశ్నపత్రం అమ్ముకున్నట్లు తెలుస్తోంది.

మరో వైపు ఈ కేసులో కీలక నిందితుల ఇళ్లలో సిట్ సోదాలు చేసింది. బడంగ్‌ పేటలోని ప్రవీణ్‌కుమార్‌ నివాసం, మణికొండలోని రాజశేఖర్‌రెడ్డిల నివాసాల్లో సిట్‌ పోలీసులు రెండు బృందాలుగా తనిఖీలు చేశారు. ఆ ఇళ్లల్లో లభించిన కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మరో నిందితుడు మేడ్చల్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసిన శ్రీనివాస్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ప్రశ్నపత్రం కొనుగోలు చేసేందుకు ఇద్దరు అభ్యరులకు లక్ష మేర ఆర్ధిక సహకారం అందించినట్టు సమాచారం.

ఇవీ చదవండి:

Last Updated : Mar 21, 2023, 6:28 AM IST

ABOUT THE AUTHOR

...view details