MLAs Poaching Case Update: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు దర్యాప్తు లోతుల్లోకి వెళ్లేకొద్దీ విస్తుపోయే అంశాలు వెలుగుచూస్తున్నాయి. ప్రలోభాలకు సంబంధించి నిందితుల మధ్య జరిగిన వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్‌లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను నివేదిక రూపంలో హైకోర్టుకు సమర్పించింది. ఇందులో రాబోయే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఎవరిని అభ్యర్థులుగా ఎంపిక చేయాలనే అంశంపై ఎక్కువగా నిందితుల చాటింగ్ ఉంది. దాదాపు వంద నియోజకవర్గాల్లో అభ్యర్థుల గురించి వీరు చర్చించుకున్నారు. ఆ వివరాలివీ..
నందకుమార్ నుంచి గురూజీ లక్ష్మీనారాయణ స్వామి- తిరుపతి పేరుతో ఉన్న నంబరుకు విరివిగా సంభాషణలున్నాయి. అందులో..
* ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గురించి చర్చించారు. ‘ఆదిలాబాద్‌లో పాయల్ శంకర్, బోథ్‌లో బలరాంజాదవ్ పేర్లున్నాయి. నిర్మల్ నుంచి బీజేపీ టికెట్ రెడ్డి సామాజికవర్గానికి ఇస్తే వాళ్లు పోటీచేస్తారు. ముథోల్‌లో డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్, ఖానాపూర్ నుంచి మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్, మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి, చెన్నూర్ నుంచి మాజీ ఎంపీ వివేక్, బెల్లంపల్లిలో మాజీ మంత్రి వినోద్, ఆసిఫాబాద్ నుంచి జడ్పీఛైర్‌పర్సన్ కోవా లక్ష్మి, సిర్పూర్ నుంచి పాల్వాయి హరీశ్‌రావులు బీజేపీ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలున్నాయి.
* ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఆయన భార్య జడ్పీ ఛైర్‌పర్సన్ సునీత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి వచ్చే అవకాశముంది.
* మహబూబాబాద్, కొడంగల్, తాండూరు, మానకొండూరు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు మునుగోడులో ఉన్నారు. రేపు ఉదయం వారిని కలవబోతున్నాం. తర్వాత విషయం చెబుతాం’ అనే చర్చలున్నాయి.
* పెద్దపల్లి నుంచి జడ్పీటీసీ సభ్యుడు గంట రాములు, నిర్మల్ నుంచి న్యాయవాది అంజుకుమార్‌రెడ్డి, కరీంనగర్ నుంచి టి.సంతోష్‌కుమార్‌ల ప్రస్తావన ఉంది.
న్యాయవాది శ్రీనివాస్, నందకుమార్ మధ్య చాటింగ్‌లో..
* నిజామాబాద్ పట్టణ, గ్రామీణ ఎమ్మెల్యేలు గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ ఎల్లారెడ్డి, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పేర్లున్నాయి. వేర్వేరు చాటింగ్‌లలో తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అని ఏక వాక్యాలున్నాయి.
నందకుమార్.. న్యాయవాది ప్రతాప్ మధ్య చాటింగ్‌లలో..
* ఇబ్రహీంపట్నం, తాండూరు, పటాన్‌చెరు, కొడంగల్, నిజామాబాద్‌అర్బన్, నిజామాబాద్‌రూరల్, ఎల్లారెడ్డి, పెద్దపల్లి, మానకొండూరు, నర్సంపేట, మహబూబాబాద్ ఎమ్మెల్యేల పేర్లున్నాయి. మరిన్ని చాటింగ్‌లలో నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డితోపాటు చేవెళ్ల, కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, మంథని, కొల్లాపూర్ ఎమ్మెల్యేల పేర్లున్నాయి.