Sir CV Raman Young Genius Awards: ప్రస్తుత రోజుల్లో మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో సుచిరిండియా పౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30వ సర్ సీవీ రామన్ యంగ్ జీనియస్ అవార్డుల ప్రదానోత్సవంలో జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు నటుడు అడవి శేషు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుచిరిండియా ఫౌండేషన్ ఎండీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. సమాజంలో విలువలు పడిపోయాయని ఆందోళన చెందారు. ఏ రంగంలో అయిన రాణించాలంటే వారసత్వం కాదని.. తనలో సత్తా అనేది ఉండాలని పేర్కొన్నారు. పరభాష అవసరమే కాని.. అదే జీవిత పరమార్ధం అనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని హెచ్చరించారు. పిల్లలు ఆడండి.. పాడండి.. ఆనందంగా ఉండండి.. వీటి అన్నింటితో పాటు దేశం గురించి కూడా ఆలోచించండి అని తెలియజేశారు. తల్లిదండ్రులు పిల్లల అభిరుచులు, అభిప్రాయాలు ఏంటో తెలుసుకొని.. వాటికి అనుగుణంగా పెంచాలని కోరారు.
ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి.. ఉత్తమమైన విద్యార్థులుగా తీర్చిదిద్దాలని ఆకాక్షించారు. పిల్లలను ర్యాంక్లు, డాలర్లు కోసం కాకుండా మానవ విలువలతో పెంచాలని అక్కడ ఉన్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచించారు. ఇప్పుడున్న పిల్లల్లో దేశం కోసం ఆలోచించే శక్తి తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలను డబ్బు సంపాదించే యంత్రాలులాగా.. తల్లిదండ్రులు చేయకూడని మనవి చేసుకుంటున్నాని జస్టిస్ ఎన్వీ రమణ విజ్ఞప్తి చేశారు. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే మీరు ఎక్కడికైనా చేరుతారని నటుడు అడవి శేషు తెలిపారు.