సింగరేణిలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. సంస్థ యాజమాన్యం పలు చర్యలు చేపట్టింది. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లోని కంపెనీ ఆసుపత్రుల్లో ఐసీయూ సదుపాయంతో ప్రత్యేక కరోనా వార్డులు సిద్ధం చేయాలని నిర్ణయించింది. సీఈఆర్ క్లబ్బులు, కమ్యూనిటీ హాళ్లు, పాఠశాల భవనాలను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించినట్టు సింగరేణి డైరెక్టర్ చంద్ర శేఖర్ తెలిపారు. ప్రతీ క్వారంటైన్ కేంద్రంలో 24 గంటలు ఒక డాక్టరు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి మరింత మెరుగైన వైద్యం అందించేందుకు.. హైదరాబాద్లోని 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు పేర్కొన్నారు.
కరోనా చికిత్స కోసం ఖరీదైన యాంటీ వైరల్ డ్రగ్స్ తెప్పిస్తున్నట్టు డైరెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. సింగరేణిలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి.. రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే ప్రతీ నెల వారి బేసిక్ జీతంపై 10 శాతం ప్రత్యేక ప్రొత్సాహక అలవెన్సు చెల్లించాలని నిర్ణయించినట్టు తెలిపారు. కరోనా సేవల్లో పని చేస్తున్న వారందరికీ 50 లక్షల రూపాయల బీమా కోవిడ్ వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఏదైనా గనిలో కేసులు పెరిగితే.. కొన్నాళ్ల పాటు గనిని మూసి వేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.