Singareni mines auction controversy: బొగ్గుల గనుల వేలం వ్యవహారం మరింత రాజకీయ వేడి రాజేసింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య నలుగుతున్న ఈ వివాదం మరింత ముదిరింది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని 101 బొగ్గు గనులను వేలం వేయడానికి గత నెల 29న నోటిఫికేషన్ జారీచేసింది. ఈ గనులపై ఈ నెల 12వ తేదీన ప్రీ బిడ్ సమావేశం నిర్వహిస్తామని.. ఆసక్తి గల ప్రభుత్వ లేదా ప్రైవేటు కంపెనీలు హాజరై టెండరు ప్రక్రియ వివరాలు తెలుసుకోవాలని కేంద్ర బొగ్గుశాఖ తాజాగా మరో నోటిఫికేషన్ ఇచ్చింది.
Singareni mines auction in Telangana : మరోవైపు ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ సమావేశానికి వెళ్లవద్దని.. ప్రైవేటు కంపెనీలతో పోటీపడి టెండర్లు వేయవద్దని, నేరుగా గనులను కేంద్రం కేటాయించేదాకా పోరాడాలని సింగరేణి సంస్థకు సూచించింది. దాంతో ఇతర ప్రైవేటు కంపెనీలు తెలంగాణలోని గనుల కోసం టెండర్లు దాఖలు చేస్తే వాటికే కేటాయించడానికి కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి దేశవ్యాప్తంగా ఉన్న పలు గనుల వేలానికి గత ఏడాది నవంబరులో కేంద్ర ప్రభుత్వం 16వ విడత టెండరు ప్రకటన జారీ చేసింది. అప్పుడు తెలంగాణలోని మొత్తం 4 గనులను వేలంలో పెట్టగా.. సత్తుపల్లి-బ్లాక్ 3 గనికి మాత్రమే ఒక టెండరు దాఖలైనట్లు కేంద్ర బొగ్గుశాఖ ప్రకటించింది.
వీటితో పాటుగా దేశంలోని మరో ఐదు గనులకు కూడా ఒకే టెండరు చొప్పున రావడంతో ఈ ఆరింటినీ ఎవరికీ కేటాయించకుండా పెండింగ్లో ఉంచి మళ్లీ ఇప్పుడు వేలంలో పెట్టింది. ఇక తెలంగాణలోని శ్రావణపల్లి, కల్యాణఖని-బ్లాక్ -6, పెనగడప గనులకు టెండర్ వేయడానికి ప్రైవేటు కంపెనీలేవీ గత నవంబరులో ముందుకు రాలేదు. తాజాగా గత నెల 29వ తేదీన జారీచేసిన 17వ విడత దేశవ్యాప్త గనుల వేలంలో ఈ గనులను మళ్లీ గనుల శాఖ చేర్చింది.
గత ఏడాది కాలంలో రెండు సార్లు వేలంలో పెట్టినా ఎవరూ ముందుకు రానందున వీటిని తమకే కేటాయిస్తారని ఎదురుచూస్తున్న సింగరేణి సంస్థకు తాజా నోటిఫికేషన్ నిరాశను మిగిల్చింది. వీటిలో పెనగడప గనిలో బొగ్గు తవ్వకం లాభదాయకం కాదని దీనిని సింగరేణి సంస్థనే గతంలోనే కేంద్ర బొగ్గుశాఖకు తిరిగి అప్పగించింది. అది కాకుండా మిగిలిన మూడింటితో పాటు గతంలో ఒక ప్రైవేటు కంపెనీకి కేటాయించిన కోయగూడెం బొగ్గగనిని కూడా తమకే ఇవ్వాలని సింగరేణి కోరుతోంది. కోయగూడెం గనికి గతేడాది వేలంలో తెలంగాణకు చెందిన ‘ఆర’ కోల్ కంపెనీ టెండరు వేసి అర్హత పొందగా.. దానిని తీసుకోవడానికి అవసరమైన ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో తిరిగి తమకే వస్తుందని సింగరేణి సంస్థ భావిస్తోంది.