కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశీయ బొగ్గుకు మార్కెటింగ్ అవకాశాలను పెంచి, తద్వారా విదేశీ దిగుమతులు తగ్గించేందుకు కృషి జరుగుతోందని సింగరేణి మార్కెటింగ్ జీఎం కె.రవిశంకర్ తెలిపారు. ఇందులో భాగంగానే సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు సింగరేణి ద్వారా అదనంగా 2 మిలియన్ టన్నుల బొగ్గును నాన్ రెగ్యులేటెడ్ సంస్థలకు ఈ - వేలం లింకేజీ ద్వారా నోటిఫైడ్ ధరకే విక్రయించేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇవాళ హైదరాబాద్లోని సింగరేణి భవన్లో కర్ణాటకలోని బళ్లారి, హోస్పేటకు చెందిన 40 స్పాంజ్ ఐరన్ సంస్థల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఏవోఎల్ విధానంతో పారదర్శకంగా..
కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రవేశ పెట్టిన ఆక్షన్ ఆఫ్ లింకేజీ (AOL) విధానం ద్వారా పూర్తి పారదర్శకంగా బొగ్గు విక్రయాలను చేసేందుకు అవకాశం లభించిందన్నారు. ఈ పద్ధతి ద్వారా ఇప్పటికే 6 సార్లు సింగరేణి వేలం నిర్వహించి సిమెంట్, క్యాప్టివ్ పవర్, స్పాంజ్ ఐరన్, పేపర్, ఫార్మా డ్రగ్స్, తదితర సంస్థలకు 10.8 మిలియన్ టన్నుల బొగ్గును లింకేజీ చేసిందని వివరించారు. ఏడోసారి అదనంగా 2 మిలియన్ టన్నులకు నిర్వహిస్తున్న ఈ- వేలం నిర్వహణ విధానం, సింగరేణి బొగ్గు నాణ్యత తదితర విషయాలపై అవగాహన కల్పించేందుకు స్పాంజ్ ఐరన్ సంస్థలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సింగరేణి కో-ఆర్డినేషన్ జీఎం కె.సూర్యనారాయణ తెలిపారు. సింగరేణిలో జీ-5 గ్రేడ్ బొగ్గు కూడా అందుబాటులో ఉందన్నారు.