Singareni CMD Transferred And Balaram Gets Additional Charge : సింగరేణి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్‌గా ఉన్న ఎన్.బాలరామ్నకు సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. సీఎండీగా పదవీ కాలం ముగిసిన శ్రీధర్‌ను జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సింగరేణి సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన ఎన్.బలరామ్, సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలరామ్‌ను ఆదేశించారు. బొగ్గు రవాణాను ఎటువంటి కొరత లేకుండా కొనసాగిస్తామని, అలాగే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా 1,200 మెగా వాట్ల విద్యుత్‌ను రాష్ట్ర అవసరాల కోసం నిరంతరాయంగా అందజేస్తామని సింగరేణి సీఎండీ బలరామ్ సీఎంకు తెలిపారు.
సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా సంక్షేమ కార్యక్రమంలో నెంబర్-1 స్థానంలో ఉండే విధంగా పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఒడిశా రాష్ట్రంలోని నైనీ బ్లాక్ నుంచి ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తిని సాధిస్తామని సీఎండీ బలరామ్ తెలియజేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లును కూడా సీఎండీ బలరాం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రిని సీఎండీ బలరాం మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.