ప్రస్తుతం సింగరేణి ఉత్పత్తి 65 మిలియన్ టన్నుల నుంచి వచ్చే ఏడాదికి 67 మిలియన్ టన్నులకు ఎదుగుతోందని సింగరేణి సీఎండీ శ్రీధర్ స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి దిశగా ముందుకెళ్లాలని సూచించారు. దేశ, రాష్ట్ర బొగ్గు, విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సంస్థ అభివృద్ధి పథంలో ఉండేలా భవిష్యత్ ప్రణాళికలు ఉండాలని సూచించారు. నాలుగేళ్లలో కొత్తగా 14 గనులు తెరవాల్సి ఉందని తెలిపారు.
ఖర్చు తగ్గించాలి... ఉత్పత్తి పెంచాలి
ప్రస్తుతం నడుస్తున్న 4 గనుల విస్తరణకు కావాల్సిన అనుమతులకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. మార్కెట్‌లో పోటీని తట్టుకొని నిలబడాలంటే నాణ్యతను పెంచడం సహా ఉత్పత్తి వ్యయాన్ని భారీగా తగ్గించుకోవాలన్నారు. ఇందుకోసం యంత్రాలు పనిచేసే సమయం పెంచాలని సీఎండీ సూచించారు.
సంస్థకు పటిష్ఠ భవిష్యత్తు కోసం..
దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేత దిశగా వెళ్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సంస్థకు పటిష్ఠ భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో పలు చర్యలకు ఉపక్రమించినట్లు తెలిపారు. భూగర్భగనుల్లో ఉత్పత్తివ్యయం ఈ ఏడాది టన్నుకు సుమారు 9వేల వరకు ఉందని ఆ మొత్తం ఎంత మేరకు తగ్గిస్తే అంత ప్రయోజనమని పేర్కొన్నారు.
సంస్థకు మంచి భవిష్యత్ కోసం సౌర, థర్మల్ విద్యుత్ రంగంలోకి అడుగుపెట్టామని గుర్తుచేశారు. నిర్మాణంలో ఉన్న 300 మెగావాట్ల ప్లాంట్ ఈ ఏడాది చివరికి పూర్తి చేయడం సహా మానేరు డ్యాంపై మరో 300 మెగావాట్ల ప్లోటింగ్ సోలార్ ప్లాంట్ నిర్మాణానికి యత్నిస్తునామని సీఎండీ శ్రీధర్ వివరించారు. ఈ సమావేశాల్లో సింగరేణి డైరెక్టర్లతో పాటు, సింగరేణి మైనింగ్, ప్లానింగ్, ఎస్టేట్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, పర్సనల్, పర్చేజ్, ఐ.టి., వంటి కీలక విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'రైతు కుటుంబానికి ధీమా ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే'