తల్లిదండ్రుల వివాదం... పసిహృదయం కన్నీళ్లు
హైదరాబాద్ నాంపల్లిలోని భరోసా కేంద్రంలో సింధు శర్మ, వశిష్ఠ కుటుంబాలకు నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ముగిసింది. పెద్దపాపను సింధుకు అప్పగించేందుకు వశిష్ఠ కుటుంబసభ్యులు అంగీకరించలేదు. భరోసా కేంద్రంలో సింధు కుటుంబసభ్యులు, మహిళా సంఘాల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది.
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నూతి రామ్మోహన్ రావు కోడలు సింధు శర్మకు ఆమె పెద్ద కుమార్తెను అప్పగించే విషయంలో నాంపల్లి భరోసా కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిన్న విశ్రాంత న్యాయమూర్తి ఇంటి ముందు సింధు శర్మ ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఇవాళ భరోసా కేంద్రం వద్ద పెద్దపాపను అప్పగిస్తామని హామినిచ్చారు. ఈ మేరకు విశ్రాంత న్యాయమూర్తి కుమారుడు నాంపల్లిలోని భరోసా కేంద్రం వద్దకు వారి పెద్ద కుమార్తెను తీసుకుని వచ్చారు. అప్పటికే అక్కడికి సింధు శర్మ, మహిళా సంఘాలు చేరుకున్నాయి. సింధు శర్మను చూడగానే పెద్ద కుమార్తె ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని కౌగిలించుకుంది. అయితే తల్లి నుంచి పెద్దపాపను బలవంతంగా తండ్రి లాక్కునే ప్రయత్నం చేశారు. కొద్ది సేపు తోపులాట జరగగా... పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ సింధు శర్మకు పెద్ద కూతురిని అప్పగించేది లేదని వశిష్ఠ తేల్చిచెప్పగా.. సింధుతో వచ్చిన మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి.