ఏపీలోని శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్దతామరాపల్లికి చెందిన ఆనెం అప్పలమ్మ చేనేత కార్మికురాలు. తమ వృత్తి వారి కుటుంబానికి భృతి కల్పించకపోవడం వల్ల కుటుంబంతో కొన్నేళ్ల కిందట హైదరాబాద్ నగరంలోని బోయినపల్లికి చేరుకొని కూలి పనులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం కూలి పనులు లేక ఒక పూట తింటే మరోపూట పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సొంత రాష్ట్రం వెళితే ఆర్థిక తోడ్పాటు లభిస్తుందని ఆమె భావిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా, సంత బొమ్మాళి మండలం హనుమంతుపురానికి చెందిన దుర్యోధన కుమార్తె పెళ్లి కోసం భూమి అమ్మి కొన్నేళ్ల కిందటే నగరంలోని మూసాపేట చేరుకొని కూలీగా మారారు. కరోనాతో కూలిపనుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇతనూ సొంత రాష్ట్రానికి వెళ్లాలని అనుకుంటున్నారు.
మహానగరంలో అనేక చోట్ల శ్రీకాకుళం జిల్లా కూలీల పేరుతో కాలనీలే ఏర్పడ్డాయి. లాక్‌డౌన్ వల్ల పనులు ఆగి ఉపాధి లేక వలస కూలీల్లో కొంతమందికి బియ్యం, ఆర్థిక సహాయం అందలేదు. తమ రాష్ట్రం వెళితే ఆర్థిక సహాయం, బియ్యం అందుకోవచ్చన్న ఉద్దేశంతో అనేకమంది వందల కిలోమీటర్ల కాలినడకన వెళుతున్నారు. ఇలా వెళ్లిన వారిని ఏపీ అధికారులు గుర్తించి క్వారంటైన్‌లో పెట్టారు.