రాష్ట్ర ప్రజలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి (TS CORONA CASES) ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3 వేల 538 కరోనా యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. రికవరీ రేటు 98.88 శాతం ఉండగా మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 6 లక్షల 74 వేల 692 మందికి వైరస్ బారిన పడినట్టు అధికారిక గణంకాలు చెబుతున్నాయి.
శరవేగంగా వ్యాక్సినేషన్...
రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ (Corona Vaccination) శరవేగంగా సాగుతోంది. రాష్ట్రంలో సుమారు 2.7 కోట్ల మంది 18 ఏళ్లు నిండిన వారు ఉండగా వారిలో ఇప్పటికే 2.42 కోట్ల మందికి కనీసం ఒక డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్టు వైద్యారోగ్య శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంపై కరోనా ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అనేక జిల్లాల్లో వారానికి కనీసం రెండు కేసులు నమోదు కావటం లేదని వైద్యారోగ్య శాఖ నివేదికలు చెబుతున్నాయి.
పదికి మించి...
రాష్ట్రంలో అనేక జిల్లాలు మహమ్మారి నుంచి కోలుకుంటున్నాయి. ముఖ్యంగా ములుగులో వైరస్ కేసులు భారీగా తగ్గాయి. గడచిన వారంలో ములుగులో ఒక్క కొవిడ్ కేసు (TS CORONA CASES) కూడా నమోదు కాలేదు. ఈ నెలలో ఇప్పటి వరకు అక్కడ నమోదైంది ఏడు కేసులు మాత్రమే. జయశంకర్ భూపాలపల్లిలోనూ గడచిన వారంలో ఒకటే కేసు నమోదు కాగా... ఈనెల మొత్తంలో ఇప్పటి వరకు ఐదుగురు కొవిడ్ బారిన పడ్డారు. నారాయణ పేటలో గడచిన 14రోజుల్లో నలుగురికి వైరస్ సోకగా... గద్వాలలో ఆరుగురు, నిర్మల్‌లో 11 మంది వైరస్ బారిన పడ్డారు. అసిఫాబాద్, మెదక్, నాగర్కర్నూల్, వికారాబాద్, కామారెడ్డిల్లో 20లోపే కరోనా కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీలో రోజుకి 50 మందికి కొవిడ్ సోకుతుండగా... రంగారెడ్డి మినహా రాష్ట్రంలో మరెక్కడా రోజుకి పదికి మించి కరోనా కేసులు నమోదు కావటం లేదు.
కొవిడ్ రహితం...
కనీసం 14 రోజుల పాటు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోతే ఆ ప్రాంతంలో వైరస్ లేనట్టే అని కొవిడ్ నిబంధనల (Covid Cases) ప్రకారం వైద్యులు చెబుతుంటారు. అయితే అయా ప్రాంతాల్లో ఇతర ప్రదేశాల నుంచి వచ్చే వారి ద్వారా మళ్లీ వైరస్ సోకే ప్రమాదం మాత్రం లేకపోలేదు. అధికారులు మరింత అప్రమత్తంగా ఉంటూ వంద శాతం వ్యాక్సినేషన్‌ని పూర్తి చేస్తే వైరస్ తక్కువ ప్రభావం ఉన్న జిల్లాలు త్వరలోనే కొవిడ్ రహితంగా మారే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన వేళ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కొవిడ్ నిబంధనలు పాటించటం ద్వారా కరోనాను నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:waiting for disability pension: దయలేని దేవుడు.. దయచూపండి మీరు..!