నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతోంది. గతంలో నోటీసులిచ్చినా స్పందించని వాటిని సీజ్ చేస్తోంది. కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని... లేదంటే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ హెచ్చరికలు జారీ చేస్తోంది.
మూడ్రోజుల్లో 225 కోచింగ్ కేంద్రాలు సీజ్ - ghmc
జంటనగరాల్లో నిబంధనలకు విరుద్ధంగా సాగుతోన్న శిక్షణా కేంద్రాలపై నగర పాలక సంస్థ కొరడా ఝళిపిస్తోంది. గడిచిన మూడ్రోజుల్లో జరిపిన తనిఖీల్లో రెండు వందలకు పైగా సంస్థలను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు.
అమీర్పేట, దిల్సుఖ్నగర్, మెహిదీపట్నంతో పాటు నగరంలోని కొన్ని ప్రాంతాలు శిక్షణ కేంద్రాలకు కేరాఫ్ అడ్రస్. ఈ ఏరియాల్లో వందల నుంచి వేల సంఖ్యలో శిక్షణ కేంద్రాలున్నాయి. ఒక్కో భవనంలోని చిన్న చిన్న గదుల్లో వందల వరకు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనికి తోడు అడ్డగోలుగా ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేశారు. వర్షాకాలంలో వీటి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన జీహెచ్ఎంసీ ఇప్పటికే ఫ్లెక్సీలను తొలగించింది. కనీస సౌకర్యాలు లేని, నిబంధనలు పాటించని 650 కేంద్రాలకు ఎన్ఫోర్స్మెంట్ విభాగంనోటీసులు అందించింది. నిర్వాహకులు స్పందించకపోవడం వల్ల దాడులు చేయడం ప్రారంభించింది. మూడ్రోజుల్లో వరుస దాడులు చేసి 225 శిక్షణ కేంద్రాలను సీజ్ చేసింది. కనీస మౌలిక సదుపాయాలు ఉన్న వాటినే ఎంచుకోవాలనివిద్యార్ధులకుఅధికారులు సూచించారు.
ఇవీ చూడండి: ఈ నెలాఖరులోగా పురపాలిక ఎన్నికలకు రంగం సిద్ధం