తెలంగాణ

telangana

ETV Bharat / state

SI Preparation Tips: ఎస్​ఐకి ఇలా ప్రిపేర్‌ అవ్వండి.. జాబ్‌ పక్కా మీదే! - how to prepare for si physical test

SI Preparation Tips: డిగ్రీ విద్యార్హతతో హోదా, ఆకర్షణీయ వేతనం, సామాజిక బాధ్యత ఉన్న ఉద్యోగంగా ఎస్‌ఐ పోస్టును చెప్పుకోవచ్చు. అందువల్లే పోటీ ఎక్కువ. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన మొదటి అంకం- ప్రాథమిక పరీక్షలో విజయం సాధించడం. సన్నద్ధతను సరైన దిశలో కొనసాగిస్తే ఇందులో గట్టెక్కడం అందరికీ సాధ్యమే. ఉన్న సమయాన్ని ప్రభావవంతంగా ఉపయోగించుకుని, ఒత్తిడి లేకుండా అధ్యయనం కొనసాగించినవారు ఎస్‌ఐ అవ్వాలనే కలను సాకారం చేసుకోవచ్చు!

SI Preparation Tips
ఎస్​ఐకి ఇలా ప్రిపేర్‌ అవ్వండి.. జాబ్‌ పక్కా మీదే!

By

Published : May 6, 2022, 4:34 PM IST

SI Preparation Tips: తాజా నోటిఫికేషన్‌తో మొత్తం 554 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో సివిల్‌ 414, ఏఆర్‌ 66, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌ 5, స్పెషల్‌ 23, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ 12, ఫైర్‌ 26, డెప్యూటీ జైలర్‌ 8 ఖాళీలు ఉన్నాయి. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ఏ విభాగంలో ఎంపికైనప్పటికీ రూ.42,300 మూలవేతనం అందుతుంది. అంటే ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే సుమారు రూ.65 వేల వేతనం పొందవచ్చు. ఫైర్‌, డెప్యూటీ జైలర్‌ పోస్టులకు మాత్రం మూలవేతనం రూ.38,890 అందుతుంది. వీరు కూడా సుమారు రూ.60 వేల జీతంతో కెరియర్‌ ప్రారంభించవచ్చు.

నెగెటివ్‌ మార్కులు

ఈ సారి ఎస్సై ప్రిలిమ్స్‌లో రుణాత్మక మార్కులున్నాయి. గతంలో ఈ విధానం ఉండేది కాదు. అందువల్ల అభ్యర్థులు సమాధానం తెలిస్తేనే జవాబు గుర్తించడం మంచిది. అసలు ఏ మాత్రం అవగాహన లేని ప్రశ్నలను వదిలేయడమే శ్రేయస్కరం. లాటరీని అనుసరిస్తే మేలు కంటే కీడు జరగడానికే అవకాశం ఉంది. ప్రతి సరైన సమాధానానికీ ఒక మార్కు కేటాయిస్తారు. అలాగే తప్పు సమాధానానికి మార్కులో ఐదో వంతు అంటే .2 మార్కులు తగ్గిస్తారు. దీని ప్రకారం చూసుకుంటే ఐదు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోల్పోవాల్సి ఉంటుంది. 200 మార్కులకు నిర్వహించే పరీక్షలో 200 ప్రశ్నలు ఉంటాయి. వ్యవధి 3 గంటలు. ప్రిలిమినరీలో అర్హత సాధించడానికి అన్ని వర్గాలవారూ 30 శాతం మార్కులు పొందడం తప్పనిసరి. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ మాధ్యమాల్లో ఉంటుంది. ప్రశ్నలకు సమాధానాలు ఓఎంఆర్‌ పత్రంపై బ్లూ/బ్లాక్‌ పెన్నుతో గుర్తించాలి. ప్రిలిమినరీలో ఉత్తీర్ణులకు ఫిజికల్‌ మెజర్‌మెంట్‌, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్టులు ఉంటాయి.

సిలబస్‌.. మార్పులు
పార్ట్‌ ఎ

అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌/మెంటల్‌ ఎబిలిటీ:100 మార్కులు.

అరిథ్‌మెటిక్‌లో నంబర్‌ సిస్టమ్‌, సింపుల్‌/కాంపౌండ్‌ ఇంట్రెస్ట్‌, రేషియో- ప్రపోర్షన్‌, సగటు, శాతాలు, లాభనష్టాలు, సమయం-పని, పని-వేతనం, సమయం-దూరం, గడియారాలు, క్యాలెండర్‌, పార్టనర్‌షిప్‌, మెన్సురేషన్‌...తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రీజనింగ్‌లో వెర్బల్‌, నాన్‌ వెర్బల్‌ ప్రశ్నలు ఉంటాయి. అనాలజీ, పోలికలు, భేదాలు, స్పేషియల్‌ విజువలైజేషన్‌/ఓరియంటేషన్‌, సమస్యను పరిష్కరించడం, విశ్లేషణ, జడ్జ్‌మెంట్‌, డెసిషన్‌ మేకింగ్‌, విజువల్‌ మెమరీ...అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

పుస్తకాలు:పాఠశాల స్థాయి గణిత పుస్తకాల్లోని ఈ అంశాలను చదివి మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. అలాగే పోటీ పరీక్షలకు సంబంధించి అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌ల్లో వివిధ పబ్లికేషన్ల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి తీసుకుని సంబంధిత అంశాలను సాధన చేస్తే ఎక్కువ మార్కులు పొందవచ్చు.

పార్ట్‌ బి

జనరల్‌ స్టడీస్‌ వంద మార్కులకు ఉంటుంది. ఇందులో 6 అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఒక్కో విభాగం నుంచి 15, ఆపైన ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది.

జనరల్‌ సైన్స్‌:ఇందులో శాస్త్ర సాంకేతికత అంశాలకు సంబంధించి తాజా మార్పులు, అభివృద్ధిపై ప్రశ్నలు వస్తాయి. నిజ జీవితంలో ఈ అంశాల అనువర్తనంపైనా ప్రశ్నలు సంధించవచ్చు. రోజువారీ పరిశీలనలతో సమాధానం రాయగలిగేలా ఈ ప్రశ్నలు ఉంటాయి. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి తాజా సమస్యలు, అంశాలపై ప్రశ్నలు వస్తాయి. వీటిని ఏ అకడమిక్‌ నేపథ్యం ఉన్నవారైనా ఎదుర్కోవచ్చు. తాజా అంశాలను అనుసరిస్తే ఈ విభాగంలో అన్ని ప్రశ్నలకూ సమాధానం గుర్తించవచ్చు. సైన్స్‌ నేపథ్యం అవసరం లేదు.

చదవాల్సినవి:6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు సైన్స్‌ పుస్తకాల్లో ముఖ్యాంశాలు, సమకాలీన శాస్త్రవేత్తల అధ్యయనాలు, అవార్డులు, వైరస్‌లు వంటి రోజువారీ అంశాలను సేకరిస్తే ఎక్కువ మార్కులు పొందవచ్చు.

* జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యమున్న సంఘటనలు:జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గత ఏడాది నుంచి జరుగుతోన్న ముఖ్య పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. ఇటీవల దేశంలోనూ, విదేశాల్లో జరిగిన సాధారణ ఎన్నికలు, దేశాల మధ్య యుద్ధాలు, నివారణ, కరెన్సీ, అవార్డులు, క్రీడలు, సదస్సులు సమావేశాలు, పుస్తకాలు రచయితలు...ఇలా ముఖ్యమైనవి తెలుసుకోవాలి.

చదవాల్సినవి:ఏదైనా ఒక దినపత్రికను అనుసరించాలి. వెబ్‌సైట్లు, మ్యాగజీన్లు, జర్నల్స్‌, ప్రభుత్వ బులిటెన్లు, నివేదికలు అనుసరించాలి.

* భారతదేశ చరిత్ర (భారత జాతీయోద్యమం):ఇందులో దేశ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలకు సంబంధించి ముఖ్య పరిణామాలపై అభ్యర్థుల అవగాహనను పరిశీలిస్తారు.

చదవాల్సినవి:6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు పాఠ్యపుస్తకాలు, ఇంటర్‌, డిగ్రీ తెలుగు అకాడమీ పుస్తకాల్లో ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్రపై రాజులు, పరిపాలన, కాలాలు వంటి అంశాలతోపాటు భాష, సంస్కృతి, శిల్ప కట్టడాలపై దృష్టిపెడితే ఎక్కువ మార్కులు పొందవచ్చు.

* భారతదేశ భూగోళం, భౌగోళిక సూత్రాలు:ఈసారి ప్రత్యేకంగా ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ జాగ్రఫీ అంశాన్ని చేర్చారు. అంటే భారతదేశంతోపాటు ప్రపంచ, భౌతిక భూగోళాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

చదవాల్సినవి:8 నుంచి 10 తరగతుల సోషల్‌ పుస్తకాల్లోని జాగ్రఫీ విభాగం, సీబీఎస్‌ఈ 8 నుంచి ప్లస్‌ 2 పుస్తకాల్లో ప్రపంచ భౌతిక భూగోళం-శీతోష్ణస్థితి, భూస్వరూపాలు, సముద్రశాస్త్రం, జీవావరణంపై పూర్తి సమాచారం పొందవచ్చు.

* పాలిటీ అండ్‌ ఎకానమీ:ఇందులో దేశ రాజకీయ వ్యవస్థ, ప్రాంతీయ అభివృద్ధి, ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణలు మొదలైన అంశాలు ఉంటాయి.

చదవాల్సినవి:ఇంటర్‌, డిగ్రీ తెలుగు అకాడమీ పొలిటికల్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌ పుస్తకాలు, సామాజిక ఆర్థిక సర్వే 2022, ఆర్థిక రంగంలో తాజా పరిణామాలు అనుసరిస్తే ఎక్కువ మార్కులు పొందవచ్చు.

* తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం:ఇందులో తెలంగాణ ఆలోచన (1948-70), సమీకరణ దశ (1971-1990), తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా (1991-2014) అంశాల్లో ప్రశ్నలు వస్తాయి.

చదవాల్సినవి:తెలంగాణ పదో తరగతి పాఠ్యపుస్తకం, ఇటీవల ముద్రించిన తెలంగాణ తెలుగు అకాడమీ పుస్తకంలో సమగ్ర విశ్లేషణ ఉంది. ఉద్యమం జరిగిన తీరుపై వివిధ జర్నల్స్‌ను ప్రత్యేక సంచికలుగా ముద్రించారు. వాటిని చదివితే ఎక్కువ ఉపయోగం.

సన్నద్ధత పూర్తయిన తర్వాత వీలైనన్ని మాక్‌ పరీక్షలు రాయాలి. ఇలా రాసేటప్పుడు సమయాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఏ విభాగాల్లో వెనుకబడుతున్నారు, ఇబ్బంది పెడుతోన్న అంశాలు గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇదే పద్ధతి ప్రతి మాక్‌ పరీక్షకూ అనుసరిస్తే పది నమూనా ప్రశ్నపత్రాలు సాధన చేసేసరికి పూర్తి పట్టు పొందడం సాధ్యమవుతుంది.

గతంలో నిర్వహించిన ఎస్‌ఐ నియామక పరీక్షల ప్రశ్నపత్రాలు గమనించాలి. వివిధ అంశాలూ, విభాగాలకు ఉన్న ప్రాధాన్యం, ప్రశ్నలడిగే విధానం తెలుసుకుని అందుకు అనుగుణంగా సన్నద్ధతలో మార్పులు చేసుకోవాలి.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details