పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళకు మాయమాటలు చెప్పి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కేసు పరిష్కరిస్తానంటూ రూ.లక్షల్లో సొమ్ము రాబట్టాడు. దర్యాప్తు ముసుగులో తరచూ ఇంటికెళ్తూ ఆమె తల్లితోనూ సన్నిహితంగా మెలిగాడు. అసలు విషయం తెలిసి బాధితురాలు అదే పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టినా పలుకుబడితో ఏళ్లపాటు తొక్కిపెట్టించాడు. దిశ హత్యోదంతం తర్వాత ఆమె సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం వల్ల ఓ ఎస్సై చీకటి వ్యవహారం వెలుగు చూసింది. అప్పటి నుంచి ఆయన విధులకు గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది.
ఆమె తల్లితోనూ వివాహేతర సంబంధం..
కొన్నేళ్ల కిందట మాదాపూర్ జోన్ పరిధిలోని ఓ పోలీసుస్టేషన్‌కు ఓ వివాహిత ఫిర్యాదు చేసేందుకొచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ‘మీకేం ఫర్వాలేదు.. సాయం చేస్తా’నంటూ అక్కడి ఓ ఎస్సై ఆమెకు అభయమిచ్చాడు. కేసు దర్యాప్తు పేరిట ఆమెతో తరచూ మాట్లాడేవాడు. విచారణ పేరుతో అతడు చేసే హడావుడి చూసి ఆమె నమ్మింది. విడతల వారీగా రూ.5 లక్షల వరకు ఇచ్చింది. ఇద్దరి మధ్య పెరిగిన చనువు వివాహేతర సంబంధానికి దారి తీసింది. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మబలికాడు. కేసు దర్యాప్తునకు వస్తున్నాడనుకుని ఆమె కుటుంబ సభ్యులూ అనుమానించలేదు. ఈ క్రమంలోనే ఎస్సై ఆ మహిళ తల్లితోనూ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.