తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రియ ఆలోచనతో ఆ పూలు వృథాకావు.. - shreya donepudi won diana awarads for ecofriendly perfume

పదో తరగతి విద్యార్థులంటే... మార్కులూ, గ్రేడులంటూ చదువుల ప్రపంచంలోనే ఉంటారు. ఇంకాస్త ఖాళీ దొరికితే ఆటపాటల్లో మునిగిపోతారు. కానీ హైదరాబాద్‌కు చెందిన శ్రియ దోనెపూడి పర్యావరణం గురించి ఆలోచించింది. అందుకే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ‘ద డయానా అవార్డ్‌’కు ఆమె ఎంపికైంది.

shreya donepudi won diana awarads for ecofriendly perfume
శ్రియ ఆలోచనతో ఆ పూలు వృథా కావిక..

By

Published : Jun 26, 2020, 1:44 PM IST

హైదరాబాద్‌కు చెందిన శ్రియ దోనెపూడి.. ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్లో చదువుతోంది. దేవాలయాలు, ఇళ్లల్లో పూజా కార్యక్రమాలకి ఉపయోగించిన పూలు వృథాగా పడేయకుండా వాటినుంచి పర్యావరణ హితమైన ఉత్పత్తుల్ని తయారుచేయాలనుకుంది. తన ఆలోచనని ఉపాధ్యాయులూ, తల్లిదండ్రులతో పంచుకోగా వారు ప్రోత్సహించారు. ఇంటర్నెట్‌లో సమాచారం సేకరించి గులాబీ, బంతి, చామంతి మొదలైన పువ్వులతో పరిమళాలు వెదజల్లే సబ్బులూ, పేపర్‌వెయిట్‌లూ, అగరబత్తీలూ, కొవ్వొత్తులతోపాటు రూమ్‌ ఫ్రెష్‌నర్లూ, షూస్‌ దుర్వాసన పోగొట్టే ఉత్పత్తుల్ని ప్రయోగాత్మకంగా చేసింది. అవి అందరికీ నచ్చడంతో గ్రామీణ మహిళలతో వాటిని పెద్ద మొత్తంలో తయారుచేయించి తన స్కూల్‌ ప్రాజెక్టులో భాగంగా ‘అంఖ్‌’ బ్రాండ్‌తో అమ్మకానికీ పెట్టింది.

భవిష్యత్తులో ఆ వస్తువులను మార్కెటింగ్‌ చేసే ఆలోచనా ఉందంటోంది శ్రియ. పిన్న వయసులో సాధించిన ఈ ఘనతకుగానూ ఆమె డయానా అవార్డుని అందుకుంది. దివంగత బ్రిటిష్‌ యువరాణి డయానా జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన ఈ అవార్డుకు వివిధ దేశాలకు చెందిన యువకెరటాల్ని ఎంపికచేస్తారు. ‘ప్రపంచాన్ని మార్చే సత్తా యువతకు ఉంది. వారికి కావాల్సింది ప్రోత్సాహమే’ అన్న లక్ష్యంతో ఈ అవార్డుని 20 ఏళ్లుగా అందిస్తున్నారు. జూలై ఒకటిన లండన్‌లో ఈ అవార్డు ప్రదానోత్సవం ఉంది. ప్రస్తుతం అక్కడికి వెళ్లలేని కారణంగా కొరియర్‌ద్వారా అవార్డుని అందుకోనుంది శ్రియ.

ఇవీచూడండి:ప్రతిఇంటికీ ఆరు మొక్కలు... వాటికి కుటుంబ సభ్యుల పేర్లు: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details