తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫోన్‌ కాల్‌కు పర్యవసానం.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు - Telangana Congress latest news

Show Cause Notices to Komatireddy: పార్టీ నియమావళిని ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి షోకాజ్‌ ఇవ్వడం ద్వారా స్పష్టం చేసింది. పది రోజుల లోపు షోకాజ్‌కు నోటీసుకు సమాధానం ఇవ్వకపోతే తదుపరి చర్యలు తప్పవని హెచ్చరించింది. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి కాకుండా.. భాజపా అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి ఓట్లు వేయాలని చెప్పిన ఆడియో కలకలం రేపింది.

Show Cause Notices to Komatireddy
Show Cause Notices to Komatireddy

By

Published : Oct 24, 2022, 9:33 AM IST

ఫోన్‌ కాల్‌కు పర్యవసానం.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు

Show Cause Notices to Komatireddy: కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సోదరుడు రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారి భాజపాలో చేరి మునుగోడు ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే పార్టీ మారడంతో అక్కడి కాంగ్రెస్‌ కార్యకర్తలకు భరోసా కల్పించే నాయకుడు లేకుండా పోయింది. దీంతో కోమటిరెడ్డి సోదరుల అభిమానులు, అనుచరులు ఎటు వెళ్లాలో తెలియక తికమక పడుతున్నారు. ఎవరి తరఫున ప్రచారం చేయాలో తెలియక వెంకట్​రెడ్డి అయోమయంలో పడ్డారు. తన సోదరుడు పార్టీ వీడినప్పటి నుంచి వెంకట్​రెడ్డి తరచూ పార్టీని, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌పై విమర్శలు చేశారు.

ఆడియో వైరల్‌: మరోవైపు తరచూ కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఫోన్‌ చేసి భాజపా అభ్యర్థి తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డికి ఓటు వేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆధారాలేం లేకపోవడంతో ఏఐసీసీ నాయకత్వం వేచి చూసింది. రెండ్రోజుల కిందట మునుగోడుకు చెందిన జబ్బార్‌ అనే వ్యక్తికి ఫోన్‌ చేసి తన తమ్ముడికి ఓటు వేయాలని సూచించారు. ఇదే ఆడియో బయటకు వచ్చి వైరల్‌ అయ్యింది. ఆ మరుసటి రోజు వెంకట్​రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన మరోసారి మునుగోడులో కాంగ్రెస్‌ను బలహీన పరిచేలా చేసింది.

ఈ రెండు అంశాలను రాష్ట్ర కాంగ్రెస్‌ ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకెళ్లింది. విషయాన్ని పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి పార్టీ షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. పది రోజుల్లోపు సమాధానం ఇవ్వకపోతే తదుపరి పార్టీపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. దీంతో కోమటిరెడ్డి సోదరులతో ఉన్నకార్యకర్తల్లో కొందరు ఇంతకాలం అయోమయంలో ఉన్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డిపై ఏఐసీసీ తీసుకున్న చర్యలతో వారిలో స్పష్టత వచ్చినట్లయిందని కాంగ్రెస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details