ఉస్మానియా ఆసుపత్రిలోని ఐసోలేషన్, ఐసీయూ రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. పడకలను పది నుంచి 40 వరకు పెంచినా.. సక్రమంగా సేవలు అందని దుస్థితి. 40 మంది రోగుల పర్యవేక్షణకు ఒకరు లేదా ఇద్దరు నర్సులనే కేటాయిస్తుండటం గమనార్హం. గాంధీ ఆసుపత్రిని పూర్తిగా కొవిడ్ సేవల కింద మార్చడంతో ఉస్మానియాకు రోగుల తాకిడి పెరిగింది. మరోవైపు ఆసుపత్రిలో సరిపడ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది లేక ఉన్నవారితోనే నెట్టుకొస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కొన్ని రోజులుగా పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
వారే ఎక్కువ
అత్యవసర కేసుల్లో ఎక్కువ శాతం శ్వాసకోశ సంబంధిత రోగులు ఉంటున్నారు. వీరితోపాటు కిడ్నీ, గుండె, ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలైన వారు వస్తున్నారు. ఐసీయూలో సరిపడ వెంటిలేటర్లు అందుబాటులో ఉండటం లేదు. దీంతో పడకల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. మరోవైపు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు సైతం చివరి క్షణంలో రోగులను ఉస్మానియాకు పంపి చేతులు దులుపుకొంటున్నాయి. అప్పటికే పరిస్థితి చేయిదాటి పోతుండటంతో వైద్యులు ఏమి చేయలేకపోతున్నారు. మృతుల సంఖ్య మాత్రం ఉస్మానియా ఆసుపత్రి ఖాతాలో పడుతోంది. తక్షణం ఉన్నతాధికారులు స్పందించి రోగుల తాకిడి మేరకు మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.