తెలంగాణ

telangana

ETV Bharat / state

రీఫిల్లింగ్‌ ఇక్కట్లు... వెంటాడుతున్న ఆక్సిజన్ సిలిండర్ల కొరత

కరోనా చికిత్సలో కీలకంగా మారిన ఆక్సిజన్‌ కోసం పాట్లు అంతకంతకూ అధికమవుతున్నాయి. వారం, పది రోజులుగా డిమాండ్‌ పెరగడంతో చాలామంది డీలర్ల చుట్టూ తిరుగుతున్నారు. అడిగినంత డబ్బు ఇస్తామని, ఎలాగైనా ఆక్సిజన్‌ సిలిండర్లు సమకూర్చాలని ప్రాధేయపడుతున్నారు. ఇప్పటిదాకా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు వాడుతుంటే ఇప్పుడు కరోనా కారణంగా ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతోంది. నెలవారీ అద్దె సిలిండర్‌ పరిమాణం మేరకు రూ.5వేల వరకు ఉంటోంది. రీఫిల్లింగ్‌ ధర క్యూబిక్‌ మీటరుకు రూ.1,000 వరకు ఉంది.

shortage-of-oxygen-cylinders-in-telangana
రీఫిల్లింగ్‌ ఇక్కట్లు... వెంటాడుతున్న ఆక్సిజన్ సిలిండర్ల కొరత

By

Published : Apr 22, 2021, 8:09 AM IST

కరోనాతో ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తి, శ్వాసకు ఇబ్బందులు వస్తుండటంతో కొందరు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు కొంటున్నారు. ఇవి విద్యుత్తు సహాయంతో నడుస్తాయి. గాలి నుంచి ఆక్సిజన్‌ తయారు చేసుకుంటాయి. వీటి కోసం రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు వెచ్చిస్తున్నారు. ఈ మధ్య వీటి వినియోగం పెరిగింది.

రోజుకి 1,500 కాల్స్‌...

‘నగరంలో వారం రోజుల్లో ప్రాణవాయువుకు డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. ఇంతకు ముందు ఎవరికి ఎప్పుడు సరఫరా చేయాలో అప్పుడు సరఫరా చేసేసేవాళ్లం. పెద్దగా ఫోన్ల ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు రోజుకు 1,500 వరకు కాల్స్‌ వస్తున్నాయి’ అని ఆసుపత్రులకు, రోగులకు ఆక్సిజన్‌ సరఫరా చేసే ఓ డీలరు తెలిపారు. ‘కొవిడ్‌ తొలిదశ సమయంలో ఆక్సిజన్‌ అవసరం తక్కువగా ఉండగా... ఇప్పుడు సెకండ్‌ వేవ్‌లో బాగా పెరిగింది. సిలిండర్లు అద్దెకు ఇవ్వాలనే డిమాండ్‌ అధికమైంది. ఎక్కువ చెల్లిస్తామని ఆఫర్‌ చేస్తున్న ఘటనలు ఎన్నో. సిలిండర్ల రీఫిల్లింగ్‌ కోసం వెళ్లినపుడు కొన్ని సంస్థలు ఇష్టానుసారం ధరలు వసూలు చేస్తున్నాయి. నెల రోజుల్లో 70 శాతం అదనంగా పెంచాయి. 20 సిలిండర్ల రీఫిల్లింగ్‌ కావాలంటే పది లేదా అయిదుతో సరిపెడుతున్నాయి’’ అని పేర్కొన్నారు. ‘‘కొందరు అవసరం లేకున్నా ముందస్తు నిల్వల కోసం సిలిండర్లు అద్దెకు తీసుకుంటున్నారు. అవసరమైన వారికి ఆక్సిజన్‌ అందుబాటులో లేకుండా పోతోంది. ఈ సమస్యను అరికట్టేందుకు డాక్టర్లు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్‌ చూపిస్తేనే సిలిండర్లు ఇస్తున్నాం’’ అని ఆటోనగర్‌ ఆక్సిజన్‌ సరఫరాదారు షరీఫ్‌ తెలిపారు.

94 శాతానికి తగ్గితే ఆసుపత్రికి వెళ్లాలి

కరోనా వచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రత్యామ్నాయ ప్రాణవాయువు అవసరం ఉండదు. వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి చేరి ఆయాసం వస్తుంటే అప్పుడు కావాలి. ప్రాణవాయువు పరిపూర్ణస్థితి 95-98 శాతం మధ్య ఉండాలి. 94 శాతానికి తగ్గితే ఆసుపత్రికి వెళ్లాలి. వారికి లిక్విడ్‌ రూపంలో ప్రాణవాయువు అందిస్తారు. తొలుత నిమిషానికి 2 లీటర్ల చొప్పున వినియోగిస్తారు. అప్పటికీ సరిపోకుంటే 4 లీటర్ల వరకు తీసుకోవచ్చు. 85 శాతానికి తగ్గిన వారికి ఆసుపత్రిలో ఎన్‌ఐవీ, సీపాక్‌, బీపాక్‌ లాంటి అధునాతన పరికరాలతో ఆక్సిజన్‌ అందిస్తారు. 8-10శాతం మంది రోగులకు తప్పని పరిస్థితుల్లో వెంటిలేటర్‌ ద్వారా ప్రాణవాయువు అందిస్తారు.

- డాక్టర్‌ ఉపేందర్‌, ప్రముఖ అనస్తీషియా నిపుణుడు

ఇదీ చూడండి:జిల్లాలపై కరోనా పంజా... వారంలోనే ఐదు రెట్ల కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details