మండుటెండల ప్రభావం సర్కారు దవాఖానాలపైనా పడుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు, సహాయకులను తాగునీటి కొరత వేధిస్తోంది. మిషన్ భగీరథ కింద అధిక శాతం ఆసుపత్రులకు ప్రత్యేక పైపులైన్ల ద్వారా నీటి సరఫరా జరుగుతున్నా.. ఎక్కువ చోట్ల మూణ్నాలుగు రోజులకోసారి నీళ్లు వస్తుండడంతో.. దవాఖానాల్లో పూర్తిస్థాయిలో నీటి అవసరాలు తీరడంలేదు. ఆసుపత్రుల్లో బోర్లు ఉన్నా.. భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. చాలా ఆసుపత్రుల్లో మధ్యాహ్నం తర్వాత వార్డుల్లో నీటి సరఫరాను నిలిపివేస్తున్నారు. దీంతో మరుగుదొడ్లు దుర్గంధభరితమవుతున్నాయి. అత్యధిక జిల్లా, ప్రాంతీయ వైద్యశాలల్లో రోగులు తాగునీటి కోసం విలవిల్లాడిపోతున్నారు. ఉస్మానియా, గాంధీ, నిజామాబాద్, ఆదిలాబాద్ రిమ్స్ తదితర కొన్ని బోధనాసుపత్రుల్లో ప్రస్తుతానికి నీటి ఎద్దడి మరీ తీవ్రంగా లేకపోయినా.. వీటిల్లోనూ వార్డుల్లో ఫ్యాన్లు మొరాయిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వేసవిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు ఎదుర్కొంటున్న అవస్థలపై ‘ఈనాడు’ అందిస్తోన్న క్షేత్రస్థాయి పరిశీలనా కథనం..
రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేసవి ధాటికి రోగులు సతమతమవుతున్నారు. తాగునీటి అవస్థలు ఒక ఎత్తయితే కొన్ని చోట్ల ఏసీలు, ఫ్యాన్లు కూడా పనిచేయడం లేదు. అక్కడక్కడా రోగులు సొంతంగా ఫ్యాన్లు తెచ్చుకొంటున్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ నీటి నిల్వ చేసే ట్యాంకులున్నాయి. వార్డుల్లోకి నీరందించేందుకు పైపులైను వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపర్చకపోవడంతో వీటి ద్వారా సరఫరా అయ్యే నీటిని తాగే పరిస్థితి దాదాపు ఏ సర్కారు దవాఖానాల్లోనూ లేదు. ఈ నీటిని కేవలం మరుగుదొడ్లకు వినియోగిస్తున్నారు. దాదాపు అన్ని ఆసుపత్రుల బయట స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేశాయి. తాగునీరు కావాలంటే రోగుల బంధువులు వార్డులొదిలి బయటకు రావాల్సిందే! ఈ చలివేంద్రాలు కూడా సాయంత్రం 6 గంటలకు మూసేస్తుండడంతో.. ఆ తర్వాత తాగునీరు కావాలంటే ఇంకా ఇంకా దూరం పరుగులు పెట్టాల్సిందే. అత్యధిక సందర్భాల్లో రోగుల సహాయకులు వాటర్ బాటిల్స్ కొనుగోలు చేయాల్సి వస్తోంది.
రోగుల అవస్థలు చూడతరమా...!
బాలింతలకు ఉక్కపోత..
కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోని ఐసీయూలో కొద్ది రోజులుగా ఏసీలు, వార్డుల్లో కొన్ని ఫ్యాన్లు పని చేయకపోవడంతో ఎండాకాలం ఉక్కపోత భరించలేక బాలింతలు ఇబ్బంది పడుతున్నారు. సహాయకులు కాగితాలతో విసురుతూ రోగులను చూసుకుంటున్నారు. మరికొందరు బయట నుంచి ఫ్యాన్లు తెచ్చి పెట్టుకుంటున్నారు.
ఐసీయూలో ఊపిరాడదు..
నల్గొండ జిల్లా జనరల్ ఆసుపత్రిలోని ఐసీయూలో ఆరు ఏసీలుండగా.. ప్రస్తుతం ఒక్కటి కూడా పనిచేయడం లేదు. దీనివల్ల రోగులు ఎండవేడిమికి ఇబ్బందులు పడడమే కాకుండా.. ఇతర యంత్రాలు కూడా మరమ్మతులకుగురయ్యే అవకాశాలున్నాయి.
*భువనగిరి జిల్లా ఆసుపత్రిలో కొన్ని వార్డుల్లో మరుగుదొడ్లకు సరిపడా నీళ్లు అందడం లేదు.
మరుగుదొడ్లకు తాళాలు..
కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి కొరతతో దుర్వాసన వస్తుండడంతో మరుగుదొడ్లకు సిబ్బంది తాళాలు వేశారు.