రాష్ట్రవ్యాప్తంగా వందలాది పాఠశాలల్లో అరకొరగా ఉన్న ఉపాధ్యాయులు అన్ని తరగతులకు బోధించలేకపోవడంతో పేద విద్యార్థుల చదువు చట్టుబండలవుతోంది (teachers Shortage). కొవిడ్‌తో ఆర్థిక పరిస్థితి దెబ్బతిని...ప్రైవేట్ పాఠశాలల ఫీజులు చెల్లించలేక సర్కారు పాఠశాలల్లో చేరిన విద్యార్థుల పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్లయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా కనీసం మరో 15 వేల నుంచి 20 వేల మంది ఉపాధ్యాయులు అవసరమని అంచనా (Shortage of 20 thousand teachers). కరోనా మహమ్మారి ఏడాదిన్నరపాటు చదువును ఆగం చేయగా...ఇప్పుడు విద్యాశాఖ నిర్లక్ష్యం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు శాపంగా మారింది. అవసరమైన చోట రెగ్యులర్ ఉపాధ్యాయులు కాకున్నా కనీసం విద్యా వాలంటీర్ల(వీవీ)నూ ప్రభుత్వం నియమించడంలేదు. దీంతో వందలాది పాఠశాలల్లో అరకొరగా ఉన్న ఉపాధ్యాయులు అన్ని తరగతులకు బోధించలేకపోవడంతో పేద విద్యార్థుల చదువు చట్టుబండలవుతోంది. కొవిడ్‌తో ఆర్థిక పరిస్థితి దెబ్బతిని...ప్రైవేట్ పాఠశాలల ఫీజులు చెల్లించలేక సర్కారు పాఠశాలల్లో చేరిన విద్యార్థుల పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్లయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా కనీసం మరో 15 వేల నుంచి 20 వేల మంది ఉపాధ్యాయులు అవసరమని అంచనా.
విద్యా వాలంటీర్ల పునరుద్ధరణా లేదు
గతానికి భిన్నంగా ఈ ఏడాది ఏకంగా 2.50 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల (private schools) నుంచి ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందారు. ఈ క్రమంలో అవసరమైన మేరకు ఉపాధ్యాయులను నియమిస్తే సర్కారు పాఠశాలలకు పూర్వ వైభవం వచ్చేది. విద్యాశాఖ మాత్రం 2020 మార్చి వరకు పనిచేసిన దాదాపు 12 వేల మంది విద్యా వాలంటీర్లను కూడా కొలువుల్లోకి తీసుకోలేదు. విద్యార్థులు పెరగడంతో ఉపాధ్యాయుల కొరత పాఠశాలలను వేధిస్తోంది. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపడితే జిల్లా
పరిధిలో ఎక్కడ పిల్లలు ఎక్కువుంటే అక్కడికి పంపొచ్చు. ప్రత్యక్ష తరగతులు మొదలై రెండున్నర నెలలవుతున్నా ఆ ప్రక్రియకు అతీగతీ లేదు. వాస్తవానికి వీవీలను తీసుకున్నా ఆరు నెలల కోసం కలిపి(నెల వేతనం రూ.12 వేల చొప్పున) బడ్జెట్ రూ.85.40 కోట్లు. రూ.11,700 కోట్ల పాఠశాల విద్యాశాఖ బడ్జెట్‌లో పిల్లల కోసం ఆ మాత్రం కేటాయించలేరా? అని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సర్కారు బడులను నమ్ముకొని వచ్చిన పిల్లలకు నాణ్యమైన విద్య దూరమవనుందని, అభ్యసన సామర్థ్యాలు మరింతగా పడిపోతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘కరోనాకు తోడు ప్రభుత్వ వైఫల్యంతో లక్షల మంది విద్యార్థులకు మరో ఏడాది పోయినట్లే’ అని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సమాఖ్య(టీఆర్‌టీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటకం రమేష్ వ్యాఖ్యానించారు.
*ఆసిఫాబాద్ జిల్లా సావర్‌ఖేడ్ ప్రాథమిక పాఠశాలలో 260 మంది విద్యార్థులకు ఇద్దరే ఉపాధ్యాయులున్నారు. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయుడు రంగయ్య భార్య కడేర్ల వీణ సైతం స్వచ్ఛందంగా పాఠాలు బోధిస్తున్నారు. విద్యాకమిటీ మరో ముగ్గురు విద్యా వాలంటీర్లను నియమించింది.