Shocking truths in Sahithi Infra Scam : ప్రీ లాంచింగ్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థ సాహితీ ఇన్‌ఫ్రా(Sahithi Infra) చేసిన వసూళ్ల దందాపై పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫ్లాట్లు నిర్మాణం చేసి ఇస్తామని డబ్బు కట్టించుకుని మోసం చేశారని 2022 ఆగష్టులో సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ భూదాటి లక్ష్మీ నారాయణపై యశ్వంత్ కుమార్‌తో పాటు మరో 240 మంది హైదరాబాద్ సీసీఎస్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎండీ లక్ష్మీ నారాయణను అరెస్ట్ చేశారు.
విమాన టికెట్ ఏజెన్సీ పెట్టిస్తామంటూ బురిడి - లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
పోలీసుల దర్యాప్తులో ఇతర డైరెక్టర్లు సహా మొత్తం 22 మంది నిందితులు ఫిర్యాదుదారుడితో పాటు పలువురిని ప్రీ లాంచింగ్ పేరిట ప్రేరేపించారని తేలింది. 1752 మందికి తమ ప్రాజెక్ట్ సాహితీ శర్వాణి ద్వారా అమీన్‌పూర్‌లో సర్వే నెంబర్ 343లో 23 ఎకరాల్లో 10 టవర్లలో 32 ఫ్లోర్ల నిర్మాణం చేపడతామని రూ.504 కోట్లు వసూలు చేశారు. కానీ ప్రాజెక్టు పూర్తి చేయకుండా వారిని మోసం చేశారు.
Sahithi Infra Realestate Scam : ప్రాజెక్టు నిర్మాణానికి హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ(GHMC) నుంచి తీసుకోవాల్సిన అనుమతులు తీసుకోలేదని దర్యాప్తులో తేలింది. 2019 నుంచే కస్టమర్ల నుంచి డిపాజిట్లు సేకరించడం ప్రారంభించిన కంపెనీ, 23 ఎకరాల్లో 10 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేశారని తేలింది. మిగిలిన 13 ఎకరాల్లో 9 ఎకరాలు సేల్స్ అగ్రిమెంట్‌పై, మరో 4 ఎకరాలు అన్ రిజిస్టర్డ్ సేల్స్ అగ్రిమెంట్‌పై తీసుకున్నారని పోలీసులు తెలిపారు.
కస్టమర్ల నుంచే సేకరించిన రూ.504 కోట్ల డబ్బుతోనే దాదాపుగా మరో 9 ప్రాజెక్టులు ప్రారంభించి, డబ్బులు వసూలు చేశారని, వాటిని కూడా పూర్తి చేయలేకపోయారని వెల్లడించారు. ఈ తొమ్మిది ప్రాజెక్టుల్లో సుమారు 500 కోట్ల మేర వసూలు చేశారని పోలీసులు తెలిపారు. నానక్‌రామ్‌గూడలో సాహితీ స్వధ కమర్షియల్ పేరిట 69 మంది నుంచి దాదాపుగా 65 కోట్లు, కొంపల్లిలో శిష్ట అడోబ్ పేరిట 248 మంది నుంచి దాదాపుగా 79 కోట్లు, కొంపల్లిలోనే సాహితీ గ్రీన్ పేరిట 153 మంది నుంచి 40 కోట్లు వసూలు చేశారు.
'ఐ'రేంజ్ మోసం - హోల్‌సేల్ ధరలో ఫోన్లు కావాలంటూ నట్టేట ముంచిన వ్యక్తి అరెస్ట్
అలాగే గచ్చిబౌలి రోలింగ్ హిల్స్‌లో సాహితీ సితార కమర్షియల్ పేరిట 269 మంది దగ్గర దాదాపుగా 135 కోట్లు, బంజారాహిల్స్‌లో సాహితీ మహితో సెంట్రో పేరిట 44మంది దగ్గర సుమారు 22 కోట్లు, నిజాంపేట్‌లో ఆనంద్ ఫార్చ్యూన్ పేరిట 120 మంది దగ్గర దాదాపుగా 45 కోట్ల 50లక్షలు, గచ్చిబౌలిలో సాహితీ కృతి బ్లూసమ్ పేరిట 25 మంది నుంచి దాదాపు 16 కోట్లు, మోకిలాలో సాహితి సుదీక్ష పేరిట 30మంది నుంచి 22 కోట్లు, బాచిపల్లిలో రూబీ కన్స్టక్షన్స్ పేరిటి 43మంది నుంచి దాదాపుగా 69 కోట్లు, ఇలా ఇవే కాకుండా పలు ప్రాజెక్టుల పేరిట మొత్తంగా దాదాపు ఇప్పటి వరకూ 1164 కోట్ల రూపాయలు వసూలు చేశారని పోలీసులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. సాహితీ ఉద్యోగులు ఇచ్చిన రికార్డుల ప్రకారం సాహితీ కృతి బ్లూసమ్, సాహితీ సుధీక్ష పేరిట 38 కోట్లు వసూలు చేసిన విషయం పేర్కొనలేదని పోలీసులు వెల్లడించారు. కాగా సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్‌తో పాటు మెదక్ జిల్లా పరిధిలో సాహితి ఇన్‌ఫ్రా వెంచర్స్ ఇండియా ప్రై లిమిటెడ్‌పై పలు ఠాణాల్లో నమోదైన 41 కేసులను 2023 సెప్టెంబర్‌లో హైదరాబాద్ సీసీఎస్‌కు బదిలీ చేశారు. దీంతో ఇప్పటివరకు సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, డైరెక్టర్లపై మొత్తంగా 50 కేసులు నమోదయ్యాయి.
'నీ పెళ్లికి పెట్టిన ఖర్చులు తిరిగిచ్చేయ్' - అన్నా వదినల వేధింపులతో యువకుడి ఆత్మహత్య