SHIVACHARAN REDDY MOTHER : ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన తండ్రి అని శివచరణ్‌రెడ్డి రిలీజ్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియోపై స్పందించిన ఎమ్మెల్యే.. తనకు కొడుకులు ఎవరూ లేరని కేవలం ఇద్దరు కూతుళ్లు మాత్రమే ఉన్నారని స్పష్టం చేశారు. కేవలం డబ్బుల కోసమే బ్లాక్మెయిల్ చేస్తున్నారని వివరణ ఇచ్చారు. అయితే ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఇచ్చిన సమాధానంపై శివచరణ్‌రెడ్డి తల్లి లక్ష్మీదేవి తీవ్ర ఆరోపణలు చేశారు.
పదిహేనేళ్ల వయసులో కొండారెడ్డి అనే వ్యక్తితో తనకు పెళ్లయినట్టు ఆమె తెలిపారు. తర్వాత ఆయనకు ఇష్టం లేకపోవడంతో రెండేళ్లకే వదిలేసి వెళ్లిపోయారన్నారు. ఆ సమయంలో పెళ్లి చేసుకుంటానంటూ రెండేళ్లపాటు తన ఇంటి చుట్టూ తిరిగిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి.. ఇప్పుడు డబ్బు కోసం వచ్చామని అబద్ధాలాడుతూ అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 18 ఏళ్లు తనను, కుమారుడిని బాగానే చూసుకున్నారని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డితో ఉన్న శాంతకుమారి కారణంగానే ఆయన తమకు దూరమయ్యారని ఆమె వివరించారు.