తెలంగాణ

telangana

ETV Bharat / state

బీఆర్కే భవన్ నుంచి సచివాలయ కార్యకలాపాలు

సచివాలయ కార్యకలాపాలు ఇవాళ్టి నుంచి బూర్గుల రామకృష్ణాభవన్ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కొన్ని శాఖల కార్యాలయాలు తరలివెళ్లగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా మెజార్టీ కార్యాలయాలు ఈరోజు తరలనున్నాయి. వరుస సెలవులున్నందున వీలైనంత త్వరగా తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

By

Published : Aug 9, 2019, 6:11 AM IST

Updated : Aug 9, 2019, 6:35 AM IST

బీఆర్కే భవన్ నుంచి సచివాలయ కార్యకలాపాలు

సచివాలయ కార్యాలయాల తరలింపు ప్రక్రియ ఊపందుకుంది. సాధారణ పరిపాలనాశాఖ, ఇంధన, రెవెన్యూ తదితర శాఖల కార్యాలయాల్లోని దస్త్రాలు, ఫర్నీచర్, ఇతర సామగ్రిని బీఆర్కే భవన్​కు తరలిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి కార్యాలయంతో పాటు ఇతర శాఖల కార్యాలయాల తరలింపునకు అవసరమైన ఏర్పాట్లు పూర్తైనా నిన్న నవమి కావడం వల్ల తరలించలేదు.

మంత్రుల కార్యాలయాలు ఇక్కడే!

శ్రావణ శుక్రవారాన్ని శుభదినంగా భావించి మెజార్టీ శాఖల కార్యాలయాలను నేడు తరలించనున్నారు. వీలైనంత వరకు ఇవాళ్టి నుంచే బీఆర్కే భవన్ నుంచి కార్యకలాపాలు నిర్వహించాలని సీఎస్ సహా అధికారులు భావిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కార్యాలయాన్ని బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయానికి తరలించనున్నారు. మిగతా మంత్రుల కార్యాలయాలను బీఆర్కే భవన్​కు తరలించనున్నారు. అయితే శాఖాధిపతుల కార్యాలయాలకు వెళ్లేందుకే ఎక్కువ మంది మంత్రులు మొగ్గు చూపుతున్నారు.

సీఎం కార్యాలయం@ మెట్రో రైల్ భవన్

ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంవో కార్యదర్శులు, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కార్యాలయాలను బేగంపేట మెట్రోరైల్ భవన్​కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సీఎంవో కార్యదర్శుల పేషీలను మాత్రం ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్​లో ఏర్పాటు చేసే అవకాశముంది. ఆస్పత్రులు, పాఠశాల, శిశువిహార్ లాంటి వాటిని కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్​కే తరలించనున్నారు.

బీఆర్కే భవన్​లో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు

కార్యాలయాలు తరలిస్తున్నందున బీఆర్కే భవన్​లో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేస్తున్నారు. వరుస సెలవులు పూర్తయ్యేలోగా మరమ్మతులు, తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్రావణమాసం ముగిసేలోపు సచివాలయంలో ఒక్క కార్యాలయం కూడా ఉండరాదన్న లక్ష్యంతో ప్రభుత్వం కనిపిస్తోంది.

బీఆర్కే భవన్ నుంచి సచివాలయ కార్యకలాపాలు

ఇదీ చదవండిఃనేడు కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశం

Last Updated : Aug 9, 2019, 6:35 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details