ఆకతాయిల కట్టడి కోసం పోలీస్ శాఖ కొత్త వ్యూహం రూపొందించింది. ఒక్కో కళాశాలలో పది మంది చొప్పున వాలంటీర్లతో ఈ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. బాధితురాళ్లకు పోలీస్ ఆద్వర్యంలోని షీ బృందాలకు వీరే అనుసంధానకర్తలుగా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ తరహా బృందాలున్నా సమీప భవిష్యత్తులో ప్రతి ప్రభుత్వ , ప్రైవేటు కళాశాలలో ఈ బృందాలు మనుగడలోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ బృందాల ఏర్పాటు దిశగా మహిళా భద్రత విభాగం కసరత్తు చేస్తోంది.
తోటి స్నేహితురాళ్లే... పోలీసులు
బాధితులు కళాశాలలో కావచ్చు.. బయట కావచ్చు... తమకు ఎదురైన వేధింపులు గురించి తోటి స్నేహితురాళ్లకు చెప్పుకోవచ్చు. ఆ వేధింపుల గురించి షీ బృందాలకు తెలిపే బాధ్యతను వాలంటీర్లే తీసుకుంటారు. సమాచారం అందుకున్న వెంటనే షీ బృందాలు రంగంలోకి దిగి, పరిస్థితిని అంచనా వేస్తాయి. వేధింపుల తీరును బట్టి హెచ్చరించి వదిలేయడం, కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇప్పించడం, కేసు నమోదు చేయడం. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వంటివి చేస్తాయి. పరిస్థితి తీవ్రంగా ఉంటే వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తారు.
నేరాల బారిన పడకుండా అవగాహన
కళాశాలల్లో వాలంటీర్ల ఎంపిక బాధ్యతను యాజమాన్యాలకే అప్పగించనున్నారు. సామాజిక అంశాలపై చొరవ చూపే గుణమున్న విద్యార్థులనే ఈ బృందాల్లోకి తీసుకుంటారు. తొలుత ఈ బృందాలకు మహిళాభద్రత, సైబర్ నేరాలు, సామాజిక మాధ్యమాల మంచీచెడులు, తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. అనంతరం ఈ బృందాలే కళాశాలల్లో తోటి విద్యార్థినులతో ఆయా అంశాలపై చర్చిస్తారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగిన నేపథ్యంలో వాటి వల్ల ఎదురయ్యే చేదు అనుభవాల గురించి అవగాహన కల్పించడంపై దృష్టి సారించనున్నారు. వీటిపై విద్యార్థినులను అప్రమత్తం చేయగలిగితే సైబర్ నేరాల బారిన పడకుండా నియంత్రించే అవకాశముండటంతో ఈ దిశగా కసరత్తు చేస్తున్నారు.