She teams assuring to students : విద్యార్థిని, విద్యార్థుల వ్యక్తిగత వివరాలను సామాజిక మాధ్యమాల ద్వారా సేకరిస్తున్న సైబర్ నేరస్థులు వారిని వేధిస్తున్నారు. ఫోన్లు, మెయిల్స్, వాట్సాప్ వీడియోల ద్వారా వారిని భయపెడుతున్నారు. విద్యార్థినులు, యువతుల చరవాణుల నంబర్లను వేర్వేరు మార్గాల ద్వారా తెలుసుకుంటున్న పోకిరీలు, సైబర్ నేరస్థులు అసభ్య చిత్రాలు, వీడియోలు పంపుతున్నారు. బాధితులకు పరిచయం ఉన్న మరికొందరు మెయిల్, ఫేస్‌బుక్ ఖాతాల ద్వారా పదేపదే వేధిస్తున్నారు. వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి, అశ్లీల దృశ్యాలుంచి వారి పరువుకు భంగం కలిగించేలా ప్రవరిస్తున్నారు. వరుసగా ఫిర్యాదులు వస్తుండటంతో ‘షి’ బృందాలు కళాశాలలకు వెళ్లి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. భయపడకండి... మేమున్నామంటూ ధైర్యం చెబుతున్నారు.. ఇంతేకాకుండా ‘షి’బృందం వెబ్‌సైట్.. ఫేస్‌బుక్ ఖాతాల ద్వారా వారికి భరోసా కల్పిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
సామాజిక మాధ్యమాల నుంచి..
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా పరిచయం పెంచుకొని ప్రేమిస్తున్నాం అంటూ చెప్తున్నారు... వారు తిరిస్కరించిన వెంటనే వేధింపులు మొదలుపెడుతున్నారు. నిందితుల్లో కొందరు బాధితులతో పాటు కళాశాలల్లో చదువుకొనే వారున్నారు. మరికొందరు బాధితులు స్నేహితులే కదా.. అనుకొని ఎప్పుడైనా సరదాగా బయటకు వెళ్తున్నారు. నిందితులు ఆ ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యంగా మారుస్తున్నారు. ఫోన్ చేసి ఫలానా చోటికి రావాలి.. లేదంటే అసభ్య చిత్రాలు, అశ్లీల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉంచుతామంటూ బెదిరిస్తున్నారు. ఇక ‘షి’ బృందాలు, పోలీసులకు బాధితుల ద్వారా వస్తున్న ఫిర్యాదుల్లో 70 శాతం ఫోన్లు, ఫేస్‌బుక్, వాట్సాప్‌ల నుంచే ఉంటున్నాయి.