Sharmila letter to opposition parties: రాష్ట్రంలో నిరుద్యోగులకు మద్దతుగా పోరాటాన్ని ముమ్మరం చేసినట్లు తెలిపిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో అన్ని పక్షాల్ని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామంటూ ఇప్పటికే పలువురు పార్టీ నేతలతో ఫోన్‌లో మాట్లాడిన ఆమె.. నిరుద్యోగుల పక్షాన పోరాటానికి కలిసి రావాలంటూ వివిధ పార్టీలకు లేఖలు రాశారు.
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, మందకృష్ణ మాదిగ, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావులకు షర్మిల లేఖలు రాశారు.
కీలకమైన పార్టీలకు ముఖ్య ప్రతినిధులుగా ప్రజా సమస్యలపై పోరాడుతూ.. మీరు చేసే పోరాటాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఆ లేఖలో వివరించారు. ఉమ్మడి కార్యాచరణ రూపొందించి నిరుద్యోగులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని వివరించారు. తెలంగాణ భవిత, యువత కోసం కలిసి నడుద్దాం, నిలిచి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. రాజకీయ విభేదాలు పక్కనపెట్టి నిరుద్యోగుల కోసం పోరాటం చేసే సమయం ఆసన్నమైందని షర్మిల పేర్కొన్నారు.