YS Sharmila Will Meet Governor: మహబూబాబాద్ నియోజకవర్గంలో 3,500కిమీ దాటిన తర్వాత తన పాదయాత్రను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ పట్టణంలో మళ్లీ అదే విధంగా బెదిరించడం లాండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించారన్నారు. తన ఎస్కార్ట్ వాహనం, అంబులెన్స్‌పై బీఆర్ఎస్ నేతలు దాడి చేశారని మండిపడ్డారు.
లోటస్ పాండ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడారు. తనపై జరిగిన దాడి అంశంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలవనున్నట్లు షర్మిల పేర్కొన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆగడాలంటూ అతనికి సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. 2,170 ఎకరాల ప్రభుత్వ భూములు ఉంటే.. శంకర్ నాయక్ 2,100 ఎకరాలను కబ్జా చేశారని ఆరోపించారు.
శంకర్ నాయక్ చేసేదే మాఫియా, కబ్జాలు.. ఆఖరుకు జర్నలిస్టులను కూడా మోసం చేశారని మండిపడ్డారు. ఆయన అసభ్య పదజాలం వాడడం వల్లే తాను స్పందించాల్సి వచ్చిందని షర్మిల స్పష్టం చేశారు. పాలక పక్ష నేతలే దూషిస్తున్నారని దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక మహిళను ఎలాంటి మాటలైనా అంటారా అని షర్మిల ప్రశ్నించారు. ఆడవాళ్లు మాట్లాడకూడదా, ప్రశ్నించకూడదా అని మండిపడ్డారు రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదని, మహిళలందరూ ఏకమయి సీఎం కేసీఆర్‌ను ఓడించాలని సూచించారు.