YS Sharmila Fires on Central and State Governments: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్ .. రెండు కోట్ల ఉద్యోగాలని బీజేపీ మోసం చేసిందని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు దొందు దొందేనని ఆక్షేపించారు. హైదరాబాద్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
లోటస్ పాండ్లోని పార్టీ కార్యాలయంలో నిరుద్యోగులతో వైఎస్ షర్మిల ముఖాముఖి నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏడాది ఉద్యోగాలు ఇచ్చి ఉంటే..కనీసం 10 లక్షల ఉద్యోగాలు వచ్చేవని అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ఎందుకు సీబీఐ దర్యాప్తు చేయిచడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీబీఐ విచారణ జరిపించేందుకు సీఎం కేసీఅర్ ఎందుకు భయపడుతున్నారని? అన్నారు. కనీసం కేంద్రప్రభుత్వం అయినా ఈ అంశంపై చొరవ చూపించాలి కదా అని పేర్కొన్నారు.
రాష్ర్టంలో 1.91 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వైఎస్ షర్మిల వెల్లడించారు. రెండేళ్లలో 80,000ని చెప్పి.. ఇప్పుడు కేవలం 33,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చారని విమర్శించారు. పేపర్ లీకులపై ఆందోళన చేస్తే.. అరెస్ట్లు చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే అన్ని పార్టీలతో కలిసి ఉద్యమం చేయాలని నిర్ణయించినట్లు వైఎస్ షర్మిల వివరించారు.