తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టాలెక్కని పీహెచ్​సీ, యూపీహెచ్​సీల ఏర్పాటు - తెలంగాణలో అభివృద్ధికి నోచుకోని పీహెచ్​సీలు

నగరానికి చేరువలో ఉన్న శంషాబాద్‌ జనాభా సుమారు లక్ష. ఇక్కడ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ఉంది. దీన్ని వంద పడకలకు అప్‌గ్రేడ్‌ చేయాలని పదేళ్లుగా చేస్తున్న ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. విమానాశ్రయానికి సమీపంలోని ఉండటం, జాతీయ రహదారిపై ఉండటంతో ఆసుపత్రి ఏ మాత్రం సరిపోవడం లేదు.

shamshabad-community-health-center-which-is-not-looking-to-expand-to-100-beds
పట్టాలెక్కని పీహెచ్​సీ, యూపీహెచ్​సీల ఏర్పాటు

By

Published : Aug 21, 2021, 11:22 AM IST

నగర శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వైద్య సేవలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఆరోగ్య కేంద్రాలు లేకుండా పోయాయి. నూతనంగా పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఏళ్ల తరబడి నానుతున్నాయి. ప్రస్తుతం శివారుల్లోని పట్టణాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. జనావాసాలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య కేంద్రాల సంఖ్య పెంచాల్సి ఉన్నా కాగితాలు దాటి ముందుకు వెళ్లడం లేదు. ప్రస్తుతం డెంగీ జ్వరాలు ప్రబలుతున్నాయి. నగర శివారుల్లోని మున్సిపాలిటీల్లో రోజుకు 30-40 కేసులు నమోదవుతున్నాయి. సర్కారీ ఆసుపత్రులు సరిపడా లేక.. ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీయాల్సిన పరిస్థితి.

ఏమిటీ నిబంధనలు!

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటే జ్వరం లేదా ఇతర అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే చూపించుకునేందుకు వీలుంటుంది. శివారు మున్సిపాలిటీల్లో ఆ పరిస్థితి లేకుండాపోయింది.

మూడు చోట్ల మంజూరు

రంగారెడ్డి జిల్లాలో బడంగ్‌పేట, మీర్‌పేట, బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్లలో యూపీహెచ్‌సీలు మంజూరయ్యాయి. ఇవి ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలోకి వచ్చే బాలాపూర్‌లో ఆరు పడకలతో యూపీహెచ్‌సీ ఉంది. మీర్‌పేట, బడంగ్‌పేట, జల్‌పల్లి ప్రాంతాల్లోని సుమారు 4.50లక్షల మంది జనాభాకు ఇదొక్కటే దిక్కు. నిత్యం 150-200 మంది రోగులు వస్తుంటారు. మీర్‌పేట, బడంగ్‌పేటలో యూపీహెచ్‌సీలు ఏర్పాటైతే బాలాపూర్‌పై భారం తగ్గుతుంది.

ఇదీ పరిస్థితి

నిజాంపేట కార్పొరేషన్‌లో దాదాపు 3లక్షల జనాభా ఉంది. రెండు పీహెచ్‌సీలే ఉన్నాయి. వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రగతినగర్‌లో యూపీహెచ్‌సీ ఏర్పాటు ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే, కార్పొరేటర్లు వైద్యారోగ్య శాఖకు విజ్ఞప్తి చేసినా అడుగు ముందుకు పడటం లేదు.

  • తూంకుంట మున్సిపాలిటీల్లో పీహెచ్‌సీ అందుబాటులో లేదు. వైద్యావసరాలకు జవహర్‌నగర్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఏడాది కిందట పీహెచ్‌సీ కోసం ప్రతిపాదనలు పంపగా బుట్టదాఖలయ్యాయి.
  • తుర్కయాంజల్‌ మున్సిపాలిటీలో లక్షకుపైగా జనాభా ఉంది. ఆరోగ్య ఉప కేంద్రాలు మినహా పీహెచ్‌సీకి నోచుకోలేదు. రెండు నెలల కిందట ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదించినా అతీగతీ లేదు.
  • కొంపల్లి, దుండిగల్‌ మున్సిపాలిటీలకు కలిపి దుండిగల్‌ ఆరోగ్య కేంద్రమే దిక్కు.
  • జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లో యూపీహెచ్‌సీ ఉండగా, 1.20లక్షల జనాభాకు సరిపోవడం లేదు. అంబేడ్కర్‌నగర్‌లో మరో యూపీహెచ్‌సీ ఏర్పాటు ప్రతిపాదన పెండింగులో ఉంది.
  • ఘట్‌కేసర్‌లో 50 పడకలతో కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం ఉంది. దీన్ని అప్‌గ్రేడ్‌ చేస్తామన్నా నేటికీ దిక్కులేదు.
  • జల్‌పల్లి, ఆదిభట్ల, నాగారం, దమ్మాయిగూడ, పెద్దఅంబర్‌పేటలో ఆరోగ్య కేంద్రాల్లేవు.

జాతీయ ఆరోగ్య మిషన్‌ నిబంధనల ప్రకారం..

  • ప్రతి 30వేల మందికి ఒక పీహెచ్‌సీ ఉండాలి.
  • పట్టణాల్లో 50-60వేల మందికి యూపీహెచ్‌సీ ఉండాలి.
  • ప్రతి నాలుగు పీహెచ్‌సీలను అనుసంధానిస్తూ 80వేల -1.20లక్షల మంది జనాభాకు ఒక సీహెచ్‌సీ ఉండాలి.
  • శివారు పట్టణాల్లో 5లక్షల మందికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ప్రైవేటు ఆసుపత్రులే దిక్కు..

మాకు సమీపంలో ఎక్కడా ప్రభుత్వ ఆసుపత్రులు లేవు. ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్సింగి లేదా రాజేంద్రనగర్‌కు వెళ్లాల్సి వస్తోంది. అంతదూరం వెళ్లలేక స్థానికంగా ప్రైవేటు ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నాం.

రెండు, మూడు వారాల్లో అందుబాటులోకి..

జిల్లాకు మంజూరైన మూడు పట్టణ ఆరోగ్య కేంద్రాలను రెండు, మూడు వారాల్లో అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి తాత్కాలిక భవనాల్లో ఏర్పాటు చేసి వైద్య సేవలు ప్రారంభిస్తాం. వైద్య సిబ్బందిని నియమిస్తాం.

ఇదీ చూడండి:TALIBAN: తాలిబన్ల చెరలో నెల్లూరు వాసులు..18 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే !

ABOUT THE AUTHOR

...view details