Shabbir Ali on TRS MLAs Buying Issue: తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పందించారు. తెరాస ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్‌హౌజ్‌లో మంచి డ్రామా ప్లే చేశారని వ్యాఖ్యానించారు. రాహుల్ పాదయాత్రకు మీడియా కవరేజ్ తగ్గించేందుకు భాజపా, తెరాస కలిసి కుట్ర చేశారని ఆరోపించారు. తెరాస ఎమ్మెల్యేలను కొనటం ప్రారంభించిందన్న ఆయన... ఇప్పుడు అమ్మకానికి సిద్ధపడిన వారిలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అని పేర్కొన్నారు. తెరాస దగ్గర బేరం ఆడిన వాళ్లు.. ఇప్పుడు భాజపాలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు.
సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు 33 మంది ఎమ్మెల్యేలను కొన్నారని ధ్వజమెత్తారు. భాజపా సైతం దేశ వ్యాప్తంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని మండిపడ్డారు. నిజాం కంటే ఎక్కువగా.. కేసీఆర్ కుటుంబ సంపాదన ఉందని విమర్శించారు. సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లోనే ఈ డ్రామా అంతా జరిగిందని ఆరోపించారు. పట్టుబడ్డాయని చెప్పిన రూ.15 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. నేరం జరిగినపుడు విచారణకు పిలిచి ప్రశ్నించాలని.. ఎమ్మెల్యేలను విచారించకుండా ప్రగతిభవన్‌కు ఎలా తీసుకెళ్తారని షబ్బీర్ అలీ నిలదీశారు.
"మూడు రోజుల నుంచి ఫోన్ సంభాషణ వ్యవహారం నడుస్తోంది. హర్షవర్థన్ రెడ్డి, రోహిత్ రెడ్డి, రేగా కాంతారావులకు అమ్ముడుపోవడం అలవాటైంది. తెరాస వాళ్లు కొనడం నేర్పించారు. మీరు ఇచ్చిన డబ్బులు వారి దగ్గర అయిపోయాయి. అందుకే వారు అటుపోయారు. అక్కడ బేరమాడుతున్నారు. కాబట్టి ఇవి రెండు డ్రామాలు. దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను పడగొట్టి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కేసీఆర్ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేల వరకు కొంటున్నారు. మీకు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి." - షబ్బీర్ అలీ కాంగ్రెస్ సీనియర్ నేత