సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మండలి మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కొత్త సచివాలయం ప్రణాళిక గురించి చర్చించేందుకు సీఎం కేసీఆర్ వారంలో రెండోసారి సమీక్ష నిర్వహించారని.. అదే కరోనా వల్ల అనేక మంది మరణిస్తుంటే.. ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని షబ్బీర్ అలీ విమర్శించారు.
'సచివాలయంపై ఉన్నంత శ్రద్ధలో కొంచెం కొవిడ్ కట్టడిపై పెట్టండి' - ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డ షబ్బీర్ అలీ
తెలంగాణలో కొత్త సచివాలయం ప్రణాళిక గురించి చర్చించేందుకు వెచ్చించిన సమయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కొవిడ్ కట్టడి చర్యలపై చూపించాలని మండలి మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కొవిడ్ వార్డుల్లో మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
రాష్ట్రంలో కరోనా కట్టడిలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి.. అన్ని శాఖలు ఆరోగ్యశాఖకు అనుబంధంగా పనిచేసేలా అవసరమైన వనరులను మోహరించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రధాన కొవిడ్ ఆసుపత్రి అయిన గాంధీలో ఆరు గంటలకుపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోతే పవర్ బ్యాకప్ లేకపోగా.. జనరేటర్ నడిపించేందుకు డీజిల్ కూడా అందుబాటులో ఉంచుకోలేదని షబ్బీర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి సెక్రటేరియట్ కొత్త భవనంపై అధిక ప్రాధాన్యతనివ్వడం తగ్గించి ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వనతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.