Sexual Harassment on Minor Girls in Hyderabad : సమాజంలో రోజురోజుకూ మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా ఆడపిల్ల అయితే చాలనుకుని మృగాళ్లలా లైంగిక దాడికి పాల్పడుతున్నారు కొందరు. వావి-వరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్నారు మరికొందరు. తమ కామవాంఛతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు ఇంకొందరు. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. ఎంత కఠినంగా శిక్షించినా.. కీచకుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.
చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించి మైనర్ బాలికపై (Rape on Minor Girl).. సయ్యద్ రవూఫ్ అనే వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ ఘటన బోరబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సయ్యద్ రవూఫ్ అనే వ్యక్తి బీఆర్ఎస్ నాయకుడిగా కొనసాగుతున్నారు. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధి వీకర్ సెక్షన్ కాలనీ బ్రాహ్మణవాడలో నివాసముంటున్నారు. అదే బస్తీలో చిన్న కిరాణం దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. రోజూ దుకాణంలోకి వచ్చే చిన్న పిల్లలకు చాక్లెట్ ఆశ చూపించి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. దీంతో అక్కడున్న బస్తీ వాసులు గమనించి తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో సయ్యద్ రవూఫ్‌ను అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.