సాగునీటి ప్రాజెక్టుల కోసం తమ పొలాలను.. పుట్టిపెరిగిన ఊళ్లను త్యాగం చేస్తున్న వారి కన్నీళ్లను తుడిచేవారు కరవయ్యారు. కనీసం వారి బాధలు వినేవారూ లేరు. సాగు భూములకు చెల్లించే పరిహారం చేతికి అందేనాటికి సమీపంలోని భూముల ధరలు రెట్టింపు అవుతున్నాయి. ఇచ్చే డబ్బుతో వేరేచోట అరెకరం కూడా రాని పరిస్థితి ఉంది. ఇక నివాస స్థలాలకు, ఇళ్లకు ప్రాజెక్టు పనులు చేపట్టిన ఏడేళ్లకు కూడా పూర్తిస్థాయి పరిహారం ఇవ్వడం లేదు. పొలాలు కోల్పోయిన ప్రజలు ఆ గ్రామంలో ఉండి ఎలా ఉపాధి పొందుతారన్న ఆలోచననూ యంత్రాంగం చేయడం లేదు. పైగా గ్రామాల చుట్టూ కందకాలు తవ్వుతుండటం, వర్షాకాలం సమీపిస్తుండటంతో ఎక్కడ వరద ముంచెత్తుతుందోననే భయంతో స్థానికులు హడలిపోతున్నారు. ఇటీవల పరిహారం కోసం ఆందోళనచేస్తూ చర్లగూడెం గ్రామానికి చెందిన నాగిళ్ల లక్ష్మమ్మ గుండె ఆగి మరణించడం, మరికొన్ని గ్రామాల్లో దీక్షలు, ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో పలు ప్రాజెక్టుల పరిధిలోని ముంపు గ్రామాల్లో ‘ఈనాడు-ఈటీవీ భారత్’ పర్యటించగా అనేక కన్నీటి గాధలు కన్పించాయి.
బాండు పేపర్‌తో మస్కా..
2015 జూన్ 11వ తేదీన అంకురార్పణ జరిగిన శ్రీరామరాజు విద్యాసాగర్‌రావు డిండి ఎత్తిపోతల పథకం కింద నల్గొండ, నాగర్‌కర్నూల్, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 3.61 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యం. దీని కింద ఎనిమిది జలాశయాలను నిర్మిస్తున్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో మర్రిగూడ, నాంపల్లి, చింతపల్లి మండలాల్లో నిర్మాణంలో ఉన్న శివన్నగూడెం, కిష్టరాయనపల్లి జలాశయాల పరిధిలో పునరావాస ప్రక్రియ గందరగోళంగా మారింది. నిరసనగా ఈ రెండింటి పరిధిలోని గ్రామాల వారు దీక్షా శిబిరాలు ఏర్పాటుచేసుకుని పనులు జరగకుండా అడ్డుకుంటున్నారు. తహసీల్దారు కార్యాలయాలు, ప్రాజెక్టు క్యాంపుల వద్ద రోజూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. శివన్నగూడెం జలాశయం కింద చర్లగూడెంలో బాధితుల ఇళ్లకు పరిహారం చెల్లింపు గడువును యంత్రాంగం పొడిగిస్తూ వస్తోంది. ‘నలభై రోజుల్లో ఇస్తామని రెండుసార్లు గడువు ఇచ్చిన అధికారులు పరిహారం పంపిణీతో సంబంధంలేని గుత్తేదారు సంస్థ నిర్వాహకులతో సంతకాలు చేయించి తమను మభ్యపెడుతూ వస్తున్నారని’ చర్లగూడెం గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తాము పనులు అడ్డుకుంటున్న ప్రతిసారీ ఇలా ఏదో ఒక సాకు చూపుతున్నారని వాపోతున్నారు. కిష్టరాయనపల్లి జలాశయం ముంపు బాధితులు కూడా ఇళ్లకు సంబంధించిన పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి చింతపల్లి మండలంలో ప్లాట్లు కేటాయించి అభివృద్ధి చేస్తామని చెబుతున్నారే తప్ప ఇప్పటికీ అప్పగించింది లేదనేది వారి ఆవేదన.
అభివృద్ధి పేరుతో నిధులు కత్తిరించి..
2015 జూన్ పదో తేదీన ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లా పరిధిలోని 12.30 లక్షల ఆయకట్టుకు సాగునీరు అందించాలనేది లక్ష్యం. దీనికోసం ప్రస్తుతం ఐదు జలాశయాలు నిర్మిస్తున్నారు. కర్వెన జలాశయం మినహా మిగిలిన వాటిలో పునరావాస ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. వెంకటాద్రి (వట్టెం) జలాశయం కింద ముంపు బాధితులకు ఇళ్ల స్థలాలు నేటికీ కేటాయించలేదు. ఇంటికి పరిహారం కింద రూ.16.50 లక్షలు మంజూరు చేయగా, అందులో రూ.5.50 లక్షలు స్థలం అభివృద్ధి కింద మినహాయించుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మిగిలిన డబ్బుతో ఇళ్లు ఎలా నిర్మించుకోవాలని ప్రశ్నిస్తున్నారు.
పిల్లనిచ్చేటోళ్లు లేరు..